సభలో లేకున్నా సస్పెండ్ చేశారు

స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు
అధికారపార్టీ నేతలు తిడుతూ తమ మనసును గాయపర్చినా..
స్పీకర్ వారిపై ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం లేదు
అధికారపార్టీది వెటకారం..తమది వివేకంః రాచమల్లు

హైదరాబాద్ః అసెంబ్లీలో స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స‌భ‌లో లేన‌ప్పుడు కూడా స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనను సస్పెండ్ చేశారని...ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారపార్టీ నేతలు ఎన్నో ర‌కాలుగా అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతూ తమ మనసును గాయపర్చినా స్పీకర్ వారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదని కడిగిపారేశారు. గత అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా కోడెల శివప్రసాదరావు ఇదే ధోరణితో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 


స్పీక‌ర్‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న సంస్కారం తమదని రాచమల్లు అన్నారు. కానీ సౌమ్యుడిగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికారపార్టీకి వంత పాడుతున్నారని విమర్శించారు. అన్యాయంగా కావాలనే  తనను స్పీకర్ కోడెల  నాలుగు సార్లు సభ నుంచి స‌స్పెండ్ చేశారని  రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌ రెడ్డి అన్నారు. స్పీకర్ ఎక్కడ కూడా ప్ర‌తిప‌క్షానికి ఇవ్వాల్సిన గౌర‌వం ఇవ్వ‌డం లేదని,  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గట్టే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదని చెప్పారు. స్పీకర్ పై తాము పూర్తిగా విశ్వాసం కోల్పోయామన్నారు.  

మాట్లాడుతున్న ప్రతిసారి మధ్యలో లేచి మంత్రి యనమల తమపై వెటకారంగా మాట్లాడుతారని రాచమల్లు మండిపడ్డారు. అధికారపార్టీది వెటకారం అయితే తమది వివేకమన్నారు. వాయిద్యాలు వాయించేవాడిలాగా అన్ని వాయిద్యాలు యనమల సభలో వాయిస్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి కార్యక్రమాలను స్పీకర్ ప్రోత్సహిస్తున్నాడు కాబట్టే, ఇష్టమొచ్చినట్లు దుర్భషలాడుతున్న అధికారపార్టీ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు కాబట్టి, నిష్పక్షపాతంగా లేడు కాబట్టి, పోలీసు కేసుల్లో ఉన్నాడు కాబట్టి, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి, ప్రజాసమస్యలను గాలికొదిలేశారు కాబట్టి, అవినీతిలో ఉన్నారు కాబట్టే కోడెలపై అవిశ్వాసం పెడుతున్నామన్నారు. 


Back to Top