కోనంకిలో యథేచ్ఛగా ముగ్గురాయి తవ్వకాలు

రోజుకు 500 ట్రక్కులు, 2500 టన్నుల తరలింపు
అక్రమార్కులకు అధికారుల అండదండలు
గురజాల ఎమ్మెల్యే అండతో గూండాగిరీ
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు

గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అధికార పార్టీ అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. గురజాల ఎమ్మెల్యే అండదండలతో గూండాగిరీ చేస్తూ 600 ఎకరాల్లోని ముగ్గురాయిని యథేచ్ఛగా తవ్వుకుపోతున్నారని మండిపడ్డారు.  ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారని కన్నెర్ర చేశారు. ఇది అధికారు లకు తెలిసినా అధికార పార్టీతో కుమ్మక్కై కిమ్మనడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్వంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ను కలసి దీనిపై ఫిర్యాదు చేశారు. తక్షణం అక్రమార్కుల ఆట కట్టించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపోరాటం చేయాల్సి ఉంటుందని తెలియజేస్తూ  వినతిపత్రం సమర్పించారు.

అనంతరం మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, కోనంకి గ్రామంలోని సర్వే నంబర్ 691,692, 693, 694, 695, 279-30ఎ, 679-30-బీ లోని మొత్తం 600 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ముగ్గురాయి మైనింగ్ విస్తరించి ఉందన్నారు. ఈ భూమిలో గడచిన 8 నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకు 500 ట్రక్కుల ముగ్గురాయిని అక్రమంగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఎలాంటి సెస్సూ, పన్ను చెల్లించకుండా యథేచ్ఛగా స్థానిక అధికారుల అండదండలతో అక్రమంగా తరలిస్తున్నారన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళుతుందన్నారు.

టన్నుకు 84 రూపాయల రాయల్టీ వంతున 2500 టన్నులకు రోజుకు 2లక్షల 10వేల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందన్నారు. మరో వైపు రోజుకు 2500 టన్నులకు 1300 వంతున మొత్తం 32లక్షల 50వేల రూపాయలు, నెలకు 9 కోట్ల 75లక్షలను తెలుగు తమ్ముళ్లు అక్రమంగా వెనకేసుకుంటున్నారని వివరించారు. దీని నుంచి రాయల్టీ రూపంలో రావాల్సిన 25 శాతాన్ని కోనంకి గ్రామం కోల్పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ మైనింగ్ గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారనీ, అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు. దీనిపై మైనింగ్ ఈడీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని మర్రి రాజశేఖర్ నిందించారు.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ, గురజాల ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఈ అక్రమ మైనింగ్ సాగుతుందని ఆరోపించారు. అధికారులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలను దొడ్డిదారిన దండుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా దీన్ని నివారించాలని ఆయన డిమాండ్ చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును అక్రమార్కులు అప్పనంగా భోంచేస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూడడం సిగ్గుచేటని విమర్శించారు.

కలెక్టర్‌ను కలసిన వారిలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కత్తెర క్రిస్టీనా, కత్తెర సురేష్, జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళరేవతి, జెడ్పీటీసీలు రామిరెడ్డి. కొలకలూరి కోటేశ్వరరావు, నన్నం సునీత, నూరుల్ అక్పాత్, బ్రహ్మారెడ్డి, జయలక్ష్మి, ప్రకాష్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సింగయ్య, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్త చిన్నపరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌రెడ్డి, యనమల సురేష్ తదితరులు ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top