నాన్న వారసుడిగా రెండడుగులు ముందుకేస్తా

నాన్నగారు ప్రజల మంచి కోరి ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆయన వారసుడిగా రెండడుగులు నేను ముందుకేస్తాను అన్నారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఎవరు చెప్పగలరీ మాట. అలనాడు రాముడు అన్నాడు, నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి అరణ్యవాసం చేస్తా అని. నేడు జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు తండ్రి నడిచిన బాటలోనే నడుస్తా అని. అనడం కాదు నడిచి చూపిస్తున్నారు.


చీకటి కమ్ముకున్న రాష్ట్రంలో, పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను తోడేస్తున్న సమయంలో ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర కరువు నేలపై తొలకరి చినుకుల్లా వర్షించింది. నేడూ అదే జరుగుతోంది. ఒకప్పటి అదే ప్రభుత్వ దాష్టీకం ప్రజలను కష్టాల పాలు చేస్తుంటే ఆయన వారసుడు తన వజ్ర సంకల్పంతో ప్రజలకు తోడుగా, అండగా నేనున్నాను అనే భరోసా కలిగిస్తున్నారు. తండ్రి చేసిన మంచి పనులు యధాతధంగా చేయడంకాదు అంతకు మించి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు.
మహానేత వైఎస్ఆర్ ఫీజు రీయంబర్స్ మెంట్ పెట్టారు. లక్షలాదిమంది నిరుపేదల జీవితాల్లో విద్యా జ్యోతిని వెలిగించారు. ఆయన వారసుడు వైయస్ జగన్ ఫీజురీయంబర్స్ మెంట్ తో పాటు హాస్టల్ ఫీజులకు 20 వేలు కూడా అందిస్తానని మాటిచ్చారు. ప్రతి ఆడబిడ్డా తన పిల్లలను బడికి పంపాలన్నారు. వారి చదువుల బాధ్యత తనదే అని నిక్కచ్చిగా చెపుతున్నారు.
ఎస్సీఎస్టీలకు భూములు పంచి, పక్కాఇళ్లను కట్టించారు దివంగత వైయస్ఆర్. ఎస్సీఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ వరం అందించారు ఆయన తనయుడు జగన్.
వృద్ధులకు 500 ఫించన్ ఇచ్చారు మహానేత. దాన్ని 2000కు పెంచుతామంటున్నారు యువనేత.
చేనేతలకు నాడు వై యస్ ఆర్ చేయూతనిస్తే, 45 ఏళ్లకే ఫించన్ అందించి వారి బతుకులకు భరోసా కల్పించాలని సంకల్పించారు వైస్ జగన్.
రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభించి పేదలకు ప్రాణదాత అయ్యాడు. ఆ ఆరోగ్యశ్రీని విస్తరించి నెట్ వర్క్ హాస్పటళ్లు పెంచి, 1000రూ.కంటే ఎక్కువ ఖర్చు అయ్యే ఏ వ్యాధినైనా ఆరోగ్యశ్రీకిందకు తీసుకువస్తామని ప్రకటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
డ్వాక్రామహిళలకు పావలావడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందించారు వైఎస్సార్. నాలుగుదఫాలుగా డ్వాక్రారుణాల సొమ్మును పొదుపు మహిళల చేతికే అందించి, సున్నా వడ్డీ రుణాలు అందిస్తామన్నారు వైఎస్ జగన్.
బిసి డిక్లరేషన్, ఇమామ్, మౌజన్ లకు వేతనాల పెంపు, గ్రామ సచివాలయం, ప్రతిపేదవాడికీ ఇల్లు, రైతు భరోసా కోసం ఏటా ప్రతి రైతుకూ 50వేలు ఇవ్వడం, అన్నదాతలకు తొమ్మిది గంటల ఉచిత పగటి విద్యుత్, రైతులకు మద్దతుధర నిర్ణయం ఇవన్నీ ప్రజల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న మరిన్ని అడుగులే. ఆతడి ప్రతి అడుగూ ప్రజాక్షేమం కోసమే. ఆతడి ప్రతి మజిలీ జనోత్సాహం మధ్యనే. ఆ తండ్రి వారసత్వాన్ని అధికారంతో కాదు, ప్రజలపై అభిమానంతో పంచుకుంటున్న యువనేతకు ఆంధ్రరాష్ట్రం యావత్తూ సలాం కొడుతోంది. వేయి కిలోమీటర్లు కాదు వేలవేల గుండెలను చేరుకోవడమే ఆ యువనేత విజయమంటోంది.

Back to Top