ఎక్కువ ఓట్లు వస్తే శోభా నాగిరెడ్డే విజేత

హైదరాబాద్:

ఆళ్లగడ్డ ‌అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికపై తలెత్తిన సందిగ్ధతకు కేంద్ర ఎన్నికల సంఘం తెర దించింది. ఆ నియోజకవర్గానికి యథావిధిగా ఎన్నిక జరుగుతున్నాయి. ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడిన దివంగత‌ భూమా శోభా నాగిరెడ్డికి ఎక్కువ ఓట్లు పోలైతే ఆమెను విజేతగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఆమె మరణించినందు వల్ల ఆ స్థానానికి తిరిగి ఉపఎన్నిక నిర్వహిస్తామని పేర్కొంది. నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణించిన తర్వాత జరిగే పోలింగ్‌లో ఆ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలైతే గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి వివరణ ఇస్తూ పంపిన సమాచారంలో ‌తెలిపింది.

ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే శోభా నాగిరెడ్డి పేరును వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అభ్యర్థిగా బ్యాలెట్‌ ఈవీఎంలో ఫీడ్‌ చేశామని, అందువల్ల మరణించిన అభ్యర్థికి ఓట్లేస్తే అవి ’నోటా’ ఓట్లు (ఎవరికీ చెందని ఓట్లు)గా పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి ఈ నెల 24న మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి‌ నుంచీ ఈ ఎన్నిక తీరుపై ప్రజల్లోనూ, రాజకీయవర్గాల్లోనూ అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ కోశాధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి ఈ అంశంపై  కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ ఈ నెల 26న లేఖ రాశారు.

‌ఆ లేఖపై ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి కె.ఎఫ్.విల్‌ఫ్రెడ్ వై‌యస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి రాసిన లేఖలో... ‘మృతి చెందిన శోభా నాగిరెడ్డి పేరును ఇప్పటికే అభ్యర్థుల జాబితాలో పొందుపరిచాం. బ్యాలెట్ పత్రాల్లోనూ ఈవీఎంపై ఉన్న బ్యా‌లెట్ పత్రంపై కూడా ఆమె పేరును చేర్చాం. ఎన్నికల ఫలితాల ప్రకటన అనేది 1961 సంవత్సరపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లోని 64వ నిబంధన ప్రకారం బ్యాలెట్ పత్రంపై ఉన్న ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలుపొందినట్లుగా ప్రకటించాలి.

‌ఇక్కడ ‘అభ్యర్థి’ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్న వారు అని అర్థం. అందువల్ల మరణించిన వ్యక్తి కూడా 64వ నిబంధన కింద అభ్యర్థే అవుతారు. చనిపోయిన వ్యక్తికి వేసిన ఓట్లు ‘నోటా’ ఓట్లుగా పరిగణించడానికి గాని, మిగతా అభ్యర్థుల కన్నా మృతి చెందిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినపుడు మరణించిన వారిని గెలిచినట్లుగా ప్రకటించకపోవడానికి ఎలాంటి అవకాశం లేదు. ఈ సందర్భంలో మరణించిన ఆమె ఎక్కువ ఓట్లు పొందితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ఎన్నికైన తరువాత ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 150, 151-ఏ, నిబంధనల ప్రకారం ఆ స్థానంలో ఉప ఎన్నికను నిర్వహిస్తారు’ అని వివరణ ఇచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top