ఇది తుగ్లక్‌ పాలన : గట్టు రామచంద్రరావు

హైదరాబాద్‌, 29 ఆగస్టు 2012 : కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన తుగ్లక్‌ పరిపాలనను తలపింపజేస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తూర్పారపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ ప్రాతిపదికగా తీసుకొని తమ బిడ్డలను ఇంజనీరంగ్‌ చదివించుకోవాలనుకున్న తల్లిదండ్రులను ప్రభుత్వ చర్యలు తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్టున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ఈ సర్కార్‌ తీరు మారడంలేదని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సదాశయంలో దివంగత వైయస̴్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్‌పథకాన్ని రక రకాల సాకులు చెప్పి రద్దు చేయాలని రాష్ర్టప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని గట్టు దుయ్యబట్టారు.

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఫీజును రూ. 35 వేలు మాత్రమే రీయింబర్సు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. సర్కార్‌ వ్యవహారం చూస్తుంటే ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా ఉందని గట్టు ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్సుమెంటు విషయంలో రాష్ర్టప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని గట్టు ఆరోపించారు. ఐదు వేల లోపు ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయంబర్సు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ విధానాల్లోనే పారదర్శకత లేదని ఆయన విమర్శించారు. పేద విద్యార్థుల జీవితాలను విధ్వంసం చేస్తున్న ప్రభుత్వం తన తీరును ఇప్పటికైనా మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.

కాగా, తమ సమస్యల కోసం పోరాడుతున్న వికలాంగులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు తెలిపారు. వికలాంగులు ఇబ్బందుల నుంచి గట్టెక్కాలన్న సదుద్దేశంతోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వారికి ఇస్తున్న పింఛన్‌ను రూ. 75 నుంచి రూ. 500కు పెంచారన్న విషయాన్న ఆయన గుర్తుచేశారు.

తాజా వీడియోలు

Back to Top