ఇది సాదాసీదా అఖిలపక్షమే: వైయస్‌ఆర్‌సిపి

న్యూఢిల్లీ, 27 డిసెంబర్‌ 2012: కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే సమావేశం సాదా సీదా అఖిలపక్షమే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి అభివర్ణించారు. హోంమంత్రి మారినప్పుడల్లా అఖిలపక్షం ఏర్పాటు చేయడం అవివేకం అని వారు వ్యాఖ్యానించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరి చెప్పకుండా ఎన్ని అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం శూన్యమే అని అన్నారు. శుక్రవారంనాటి అఖిలపక్ష సమావేశంలో పార్టీ తరఫున అభిప్రాయం వెల్లడించేందుకు వారిద్దరూ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి, కె.కె. మహేందర్‌రెడ్డి కాసేపు మీడియాతో మాట్లాడారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పూటకో మాట చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. 2008లో లేఖ ఇచ్చి 2009లో యూటర్ను తీసుకున్నది చంద్రబాబే అని మైసూరా, కేకే దుయ్యబట్టారు.
Back to Top