ఇది రాక్షస పాలన కాదా?

నూజివీడు 12 ఏప్రిల్ 2013 : రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అడ్డూఆపూ లేకుండా జరుగుతున్నాయని శ్రీమతి వైయస్ షర్మిల విమర్శించారు. తెనాలి, హైదరాబాద్, చిత్తూరు ఘటనలను ఆమె ప్రస్తావించారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది రాక్షస పాలన కాదా? అని ఆమె ప్రశ్నించారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా కృష్ణాజిల్లా నూజివీడులో శుక్రవారం రాత్రి జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో లాగే ఇప్పుడు కూడా మహిళలకు రక్షణ కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విపక్షాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయో అర్థం కావడం లేదంటున్న ముఖ్యమంత్రికి లేని కరెంటుకు బిల్లులు వసూలు చేయడం అమానుషమని ఎప్పుడు అర్థమౌతుందోనని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డిగారి రెక్కల కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని ఆమె అన్నారు.

శ్రీమతి షర్మిల మాటల్లోనే....
"రాజశేఖర్ రెడ్డిగారు బ్రతికున్నప్పుడు రైతులు రాజుల్లాగా బ్రతికారు. వాళ్లకి నీళ్లిచ్చారు..ఉచిత విద్యుత్తు ఏడు గంటలు ఇచ్చారు. అన్ని విధాలా ఆదుకున్నారు...విత్తనాలు, ఎరువుల ధరలను ఒక్క రూపాయి కూడా పెరగనివ్వ లేదు. మద్దతు ధర కల్పించి ప్రతి రైతూ బాగుపడేలా చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అప్పడు ఇన్ పుట్ సబ్సిడీ, నష్టపరిహారం కూడా ఠంచనుగా అందేవి. రూ 12 వేల కోట్లతో రైతులకు రాజశేఖర్ రెడ్డిగారు రుణమాఫీ కూడా చేశారు. అంతకు ముందు రైతులకు, మహిళలకు చంద్రబాబు హయాంలో రూపాయి వడ్డీకి రుణాలిచ్చేవారు. రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక పావలా వడ్డీకే రుణాలివ్వడం జరిగింది. లక్షలాది మంది మహిళలు రుణాలు తీసుకుని ఆర్థికంగా స్థిరపడ్డ రోజులవి. డబ్బు లేని కారణంగా ఏ విద్యార్థీ చదువు ఆగిపోకూడదని నాడు వైయస్ భావించారు. విద్యార్థులకు భరోసా కల్పించారు...లక్షల కొద్దీ పక్కా ఇళ్లు కట్టించారు. ఆరోగ్యశ్రీని అద్బుతంగా అమలు చేశారు. ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే వచ్చేది 108. బియ్యం పథకమైతేనేమీ, అభయహస్తమైతేనేమీ ఎన్నో జరిగాయి. 
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్నది రాజశేఖర్ రెడ్డిగారి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమే తప్ప రాజశేఖర్ రెడ్డిగారి ప్రభుత్వం కానే కాదు.
కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి నీళ్లు బంద్...ఇళ్లకి కరెంటు బంద్...విద్యార్థులకి చదువులు బంద్...పరిశ్రమలకి పవర్ బంద్...కార్మికులకి పని బంద్...రాష్ట్రానికి అభివృద్ధి బంద్...మన ప్రజలకి మనశ్శాంతి కూడా బందు...కానీ ఆడవాళ్ల మీద అత్యాచారాలు మటుకు యధేచ్ఛగా జరుగుతున్నాయి. మొన్న తెనాలిలో చూశాము. 
నలుగురు యువకులు ఒక అమ్మాయిని ఏడిపిస్తే వాళ్ల అమ్మ అడ్డుకుందట. ఆమెని లారీ కిందికి తోసేసి చంపేశారు. ఆ నలుగురిలో ఒకడు కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకట...పాపం ఆ అమ్మాయి చేత పోలీసులు వైట్ పేపర్ల మీద సంతకాలు కూడా తీసుకున్నారట. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని బాధితులను కాపాడకుండా బాధించిన నిందితుల తరఫున నిలబడ్డారంటే ఇది రాక్షసుల పాలన కాదా? అని అడుగుతున్నాం.
నిన్న హైదరాబాద్ శివార్లలో ఒక యువతిపై అత్యాచారం చేసి తగలబెట్టేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రిగారి సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ఒక మహిళ పెళ్లికి ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి తగలబెట్టేశారట. ఇదీ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. చంద్రబాబు హయాంలో ఎలాగైతే మహిళలకి భద్రత లేకుండా ఉండిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది...చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనురాధ అనే అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది. కోలుకోవడానికి సంవత్సరాలు పట్టింది. సహాయం చేయమని కోరితే రోడ్డు మీద జరిగిన సంఘటనకు నాకు బాధ్యత లేదన్నారు. హై కోర్టుకు వెళితే ఐదు లక్షల నష్టపరిహారం, ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పింది. కానీ చంద్రబాబు మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లారు ఆ యువతిపైన. సుప్రీంకోర్టు కూడా బాబు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. కానీ అప్పటికీ ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక పరిహారం, ఉద్యోగం ఇచ్చారు. అదీ రాజశేఖర్ రెడ్డిగారికీ, చంద్రబాబుకూ ఉన్న తేడా...

కరెంటు నిల్లు..బిల్లు ఫుల్లు...
కిరణ్ కుమార్ రెడ్డికి కూడా చంద్రబాబే ఆదర్శం. అందుకే కాబోలు చంద్రబాబు హయాంలో ఉన్నట్లుగానే ఇప్పుడూ కరువు వచ్చింది. ప్రజలు అప్పులపాలయ్యారు. బతుకు భారమైంది. తాగునీరు, సాగునీరు లేదు. కరెంటు లేదు. కళ్ల ముందే వ్యవసాయం, పరిశ్రమలు కుదేలైపోతున్నాయి. కానీ ముఖ్యమంత్రికి కానీ, చంద్రబాబుకు కానీ పట్టలేదు. రైతులకి మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిగారు ఉండి ఉంటే తొమ్మిది గంటల కరెంటు వచ్చి ఉండేది...ఇప్పుడిచ్చే కరెంటుకు నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి...విద్యార్థుల చదువులకూ కరెంటు లేకుండా పోయింది...పరీక్షల సమయంలోనూ కరెంటు తీసేస్తున్నారు...పరిశ్రమలు మూతబడి 20 లక్షల మంది కార్మికులు రోడ్డున పడిన పరిస్థితి. కరెంట్ నిల్లు... బిల్లు మాత్రం పుల్లు...నిన్న ఒక గుడిసెకి వెళ్లాను..ఒకే ఒక్క బల్బు ఉంది. కానీ బిల్లు మాత్రం నాలుగు వందలు వచ్చిందని చెప్పింది. అంతకు ముందు ఐదొందల బిల్లు వచ్చిందట. లేని కరెంటుకు మూడింతలు బిల్లు వస్తోంది. కానీ ముఖ్యమంత్రి అంటున్నారు...ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో ఆయనకు అర్థమే కావడం లేదట. కరెంటు ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అమానుషమన్న సంగతి మన ముఖ్యమంత్రిగారికి ఎప్పుడు అర్థమౌతుందో? మన రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బాగుపడతారో తెలియదు.
ఏకంగా రూ.30 వేల కోట్లను వాళ్ల రక్తం పిండైనా సరే ప్రజల నుండి వసూలు చేయాలనుకుంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డిగారు...మళ్లీ పదివేల కోట్లను వ్యాట్ రూపంలో ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం భారం మోపిందీ అంటే దీనికి కారణం చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలే...తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి తనని తాను కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రజలను తాకట్టు పెట్టి కాంగ్రెస్‌కు అమ్ముడుపోయాడు..." అని శ్రీమతి షర్మిల విమర్శించారు.










Back to Top