ఇది చంద్రబాబు మార్కు చెత్త పాలన

నాగార్జునసాగర్‌ (నల్గొండ జిల్లా) : 'రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నది చంద్రబాబు నాయుడి పాలన రెండో భాగం’ అంటూ శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో కష్టాలు, కన్నీళ్లను చవిచూశాం.. ఆయన హయాంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్‌ కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు పాలననే తలపిస్తోంది' ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 67వ రోజు శుక్రవారంనాడు నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజల కష్టాలు విన్న శ్రీమతి షర్మిల పై విధంగా స్పందించారు. జగనన్న త్వరలో వస్తాడని కష్టాలన్నీ గట్టెక్కిస్తాడని ప్రజలకు ఆమె భరోసా ఇచ్చారు.

‘ఆఖరి వాన కురిసి ఐదు నెలలు దాటింది.. పంటల సంగతి దేవుడెరుగు.. ఊళ్లలో మనుషులు తాగడానికి.. పశువులు తాగడానికి కూడా నీళ్లు లేవు.. రోజుకు రెండు గంటలకు మించి కరెంటు రాదు. మోటారు నుంచి నీళ్లు దునికి మడికి పారక ముందే మళ్లీ కరెంటు పోతది.. పొద్దంతా కష్టం చేసి ఇంటికి పోయి పడుకుందామంటే దోమల మోత..‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ పోయిన తరువాత మా బతుకంతా చీకట్లే’ అని ముకుందాపు‌రానికి చెందిన రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

‘మా మహిళా సంఘం తరఫున బ్యాంకు నుంచి రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాం. మూడేళ్ల నుంచి అప్పు కడుతున్నాం. ఇంకా రూ.1.66 లక్షల అప్పుంది. నెల నెలా వడ్డీ కట్టించుకుంటున్నారు. పావలా వడ్డీ అని చెప్తున్నారు కానీ రూ.3 వడ్డీ దాకా లెక్కొస్తోంది..’ గోడు వెళ్లబోసుకున్న ముకుందాపురానికే చెందిన నాగమణి.

‘అక్కా పరీక్షలు దగ్గర పడ్డాయి. చదువుకుందామంటే రాత్రి కరెంటు ఉండటం లేదు.. ఫీజు రీయింబర్సుమెంటు ఇంత వరకు రాలేదు. ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని యాజమాన్యం చెప్తోంది. అమ్మ వాళ్లను ఫీజు అడిగితే.. చూస్తున్నావుగా బిడ్డా పంట చేతికి రాలేదు. ఫీజు ఎట్టా కట్టా‌లె అంటున్నారు. భయం వేస్తోందక్కా..’ నిడమనూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చంద్రకళ కళ్లనీళ్లు.

ప్రజా సమస్యలు పట్టించుకోని అసమర్థ కాంగ్రె‌స్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంట‌ కాగుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాగింది. నిడమనూరు, ముకుందాపురం‌లలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో రాములమ్మ, నాగమణి, చంద్రకళ తమ గోడు చెప్పుకొన్నారు. వీరే కాదు.. పాదయాత్రలో రోజూ ఏ పల్లెకు వెళ్లి పలకరించినా ఇలాంటి కష్టాలే! ఎవరిని కదిలించినా.. ఇవే కన్నీళ్ళే. ఏ రైతు ముఖం మీదా చిరునవ్వు లేదు. ఏ మహిళ నోటి నుంచీ ప్రభుత్వం అంటే ఒక్క మెచ్చుకోలు మాట లేదు. నిడమనూరు, ముకుందాపురంలలో జరిగిన రచ్చబండల్లోనూ ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెరిగిన ధరలతో తమకు బతుకే భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు విన్న శ్రీమతి షర్మిల.. జనాన్ని గాలికొదిలేసిన పాలకులపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. రోజుకు రెండు గంటలే కరెంటు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు.‌

చంద్రబాబూ.. జనం గోడు మీకు వినిపిస్తోందా?:
‘చంద్రబాబుగారూ.. వీళ్ల మాటలు మీకు వినిపిస్తున్నాయా? ప్రజల కన్నీళ్లు మీకు కనిపిస్తున్నాయా? ఇక ఆపండి.. పాదయాత్రల పేరుతో మీరు చేస్తున్న డ్రామాలు ఆపండి. మీరు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని అంటున్నారు. ఈ ప్రజల అవసరాలు మీకు కనిపించడం లేదా? మీకు ప్రజల మీద ప్రేమ కంటే కుర్చీ మీద మమకారమే ఎక్కువ. అందుకే అవిశ్వాసం పెట్టకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓటేసే ముందు గుర్తుంచుకోవాలంటూ పాదయాత్ర డ్రామాలాడుతున్నారు. మీరు అవిశ్వాసం పెట్టడం లేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మీపై కేసులు పెట్టదు.. విచారణ జరపదు. ప్రజలు ఎటు పోయినా వీళ్లకు అవసరం లేదు.

ఇది‌ కాంగ్రెస్‌ పాలన కాదు.. బాబు పాలనే..:
'రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పత్తి వేస్తే రైతన్న కష్టం పోనూ క్వింటాల్‌కు రూ. 5 వేల ఖర్చు వస్తోంది. కానీ మార్కెట్‌లో పత్తి మద్దతు ధర రూ. 3,900కు మించలేదు. తరుగు, దళారుల మోసం తీసేస్తే రైతన్న చేతికి వస్తుంది కేవలం రూ. 2,500లే. అప్పుల బాధలు పడలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క పత్తి రైతులే కాదు.. టమాటా, మిర్చి.. వరి సాగు చేసే ప్రతి రైతూ కన్నీళ్లు పెడుతున్నారు. రైతులు పంటలు చేతికి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యారు. ఆదుకునే నాథుడు లేక అల్లాడిపోతున్నారు. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు పెంచారు. రైతు మద్దతు ధరనేమో దించారు. ఇవే కష్టాలు, కన్నీళ్లను చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో చూశాం.. ఆయన హయాంలో దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్‌ కుమార్‌రెడ్డి పాలన కూడా చంద్రబాబు పాలననే తలపిస్తోంది.

మహానేత వైయస్ హయాంలో రూ.12 వేల కోట్ల రుణమాఫీ‌ :
'ఇప్పుడైతే రైతులకు కూడా కరెంటు బిల్లులు ఇస్తున్నారు. ఆ బిల్లులు కట్టకపోతే మోటార్లు, స్టార్టర్లు ఎత్తుకుపోతున్నారు. అమ్మా ఇదెక్కడి అన్యాయం అంటున్నారు రైతులు. మహానేత వైయస్‌ఆర్ అధికారంలోకి రాగానే రూ.1,300 కోట్ల విద్యు‌త్ బకాయి‌లు రద్దు చేశారు. 7 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మాటిచ్చి.. ఇచ్చి చూపించారు. మహానేత వై‌యస్ రాజశేఖరరెడ్డి బతికే ఉంటే ఈ రోజు విద్యు‌త్ చార్జీలు పెరిగేవే కాదు. వై‌యస్ విత్తనాల ధరలను దించారు.. ఎరువుల ధరలు పెరగనివ్వలేదు. మద్దతు ధర కల్పించారు. రైతులను‌ వై‌యస్‌ఆర్ గౌరవించారు.. ప్రేమించారు.. అందుకే రైతన్నలు బాగుపడాలని రూ. 12 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. కానీ ఇప్పుడున్న ఆ సర్కారుకు పెద్దమనసు లేదు. మహిళలైతే తమ పిల్లలను స్కూల్‌కు పంపించకుండా తమ వెంట పనులకు తీసుకొని పోతున్నారు. ఎందుకక్కా అని అడిగితే ‘కూలికి తీసుకొని పోతే కూలి డబ్బులు వస్తాయి కదమ్మా.. కనీసం రెండు పూటలైనా తింటాం’ అని చెప్తున్నారు. ‘ఒక రోజంతా కూలి చేస్తే రోజుకు 100 రూపాయలు వస్తాయి. నెల రోజులు కష్టం చేస్తే 3,000 రూపాయలు వస్తాయి.. పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలకు ఈ డబ్బులు ఎలా సరిపోతాయమ్మా.. మేం ఎలా బతకాలమ్మా’ అని వారు అంటున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు చదువులు మానేస్తున్నారు :
పేదోళ్లు పెద్ద చదువులు చదవాలని, ప్రతి ఇంటి నుంచి డాక్టరో.. ఇంజనీరో.. కలెక్టర్ లాంటి పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆలోచనతో వై‌యస్‌ఆర్ ఫీజు రీయింబ‌ర్సుమెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఆయన ఉన్నంత కాలం విద్యార్థుల ఫీజులను ఆయనే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ఏం చేశారు? విద్యార్థి ఫీజులో రెండు వాటాలు తల్లిదండ్రులు భరిస్తే... ఒక వాటా మేం ఇస్తామని విద్యార్థులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఫీజులు కట్టలేక విద్యార్థులు మధ్యలోనే చదువులు మాస్తున్నార’ని షర్మిల విచారం వ్యక్తం చేశారు.

శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ 67వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా అలీనగర్ శివారు నుంచి‌ ప్రారంభించారు. అక్కడి నుంచి వెంకటేశ్వరనగర్, నిడమనూరు, నర్సింహులగూడెం, బీకే తాండా, బొక్కముంతలపాడు గ్రామాల మీదుగా ముకుందాపురం చేరుకున్నారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 14.8 కిలోమీటర్ల దూరం‌ శ్రీమతి షర్మిల నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 972.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నాయకులు కె.కె. మహేందరర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, గట్టు శ్రీకాంత్, బాలమణెమ్మ, స్థానిక నాయకులు బండారు మోహ‌న్‌రెడ్డి, గాదె నిరంజన్, విరిగినేని అంజయ్య, ఇరిగి సునీ‌ల్ కుమా‌ర్, మల్లు రవీంద‌ర్‌రెడ్డి, సూరపల్లి సత్యకుమారి తదితరులు శ్రీమతి షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.
Back to Top