‌‌ఇది చేతకాని సర్కారు: విజయమ్మ

కర్నూలు, 9 జనవరి 2013:

నాణ్యమైన కరెంట్‌ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం సర్చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు పట్టణంలోని విద్యుత్తు సూపరింటెండింగ్ ఇంజినీర్ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం చేపట్టిన మహాధర్నాలో ఆమె పాల్గొన్నారు. మహానతే డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పాలకులు ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కరెంట్‌ కోతలు, భారీ పన్నులతో ప్రజలను వేధిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చకుండా ప్రధాన ప్రతిపక్షం డ్రామాలాడుతోందని విజయమ్మ విమర్శించారు.
     విద్యుత్తు చార్జీల పెంపు ‌ప్రతిపాదన నిర్ణయంపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పోరుబాట పట్టింది. చార్జీల పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని‌ విద్యుత్తు ఉపకేంద్రాల ముందు బుధవారం ధర్నాలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు.
     కర్నూలు బళ్లారి చౌరస్తాలోని విద్యుత్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీరు కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా‌కు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నాయకత్వం వహించారు. ఇప్పటికే కిరణ్‌ ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా ఇంధన సర్దుబాటు పేరిట వినియోగదారులపై పెనుభారం మోపుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. తాజాగా ఎప్పుడూ లేనట్లుగా విద్యుత్తు చార్జీల పెంపునకు కాంగ్రె‌స్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయడాన్ని వై‌యస్‌ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యు‌త్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని‌ పార్టీ డిమాండ్ చేసింది.
     ధర్నాలో పలువు‌రు స్థానిక వైయస్ఆర్‌సిపి నాయకులు, వందలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా పెద్ద పెట్టున వారు నినదించారు.

Back to Top