సత్తెనపల్లి (గుటూరు జిల్లా) : అన్నదాతలను ఆదుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానిది చేతగానితనమని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. కిరణ్ ప్రభుత్వం అసమర్థత కారణంగా రైతన్నలకు నిలువెల్లా గాయాలే అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు విత్తన సంస్థలు తోక ముడిచాయని ఆమె పేర్కొన్నాయి. కానీ, ఇప్పుడు అదే విత్తన సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం కారణంగా ఇప్పుడు మళ్ళీ జూలు విదిలించి రైతన్నలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రూ. 1800 ఉన్న 450 గ్రాముల బి.టి. విత్తనాల ప్యాకెట్ ధరను మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ రూ. 650కి దించిన వైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు హయాంలోని ధరకే అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగి పరోక్షంగా వత్తాసు పలుకుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. రైతుల పంటకు గిట్టుబాటు ధర సంగతి దేవుడెరుగు కనీసం కొనే దిక్కు కూడా లేదని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సిసిఐ అధికారులు దళారులతో కుమ్మక్కై పత్తి పంటను నేరుగా దళారుల గుప్పిట్లోకే పంపిస్తున్నారని ఆమె ఆరోపించారు.
పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిలను చినతుర్కపాలెం గ్రామానికి చెందిన రైతు ఖాజావలి మాదాల గ్రామ శివారులో కలిశాడు. ‘అమ్మా... పిందె దశలో కరెంటు లేకపోవడంతో నీళ్లు రాక కాయ ఎదగలేదు. ఎకరానికి రూ. 40 వేలు పెట్టుబడి పెట్టి పత్తి తీశాను. అది తీసుకొని మార్కెట్‌కు వెళ్లి.. మూడు రోజులుగా అక్కడే ఉంటే.. ఇది గుడ్డి పత్తి అని మార్కెట్ సారోళ్లు కొనబోమని చెప్పారు. ఈ పత్తిని నేను ఏం చేసుకోనమ్మా..’ అని ఖాజావలి ఆవేదన వ్యక్తం చేశారు. మాదాలకు చెందిన మల్లీశ్వరి, రాణి అనే మిరప రైతులు శ్రీమతి షర్మిలను కలిసి.. ‘అమ్మా మా గ్రామంలో నకిలీ విత్తనం ఇచ్చారు. చేనంతా గిడసబారిపోయిందమ్మా... ఇంత ఖర్చు చేసి పంట వేసుకుంటే రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదమ్మా’ అంటూ గిడసబారిన మిరప మొక్కలను చూపించి ఆవేదన వ్యక్తంచేశారు.
బి.టి. సంస్థలు మెడలు మహానేత వైయస్‌ఆర్ వంచారు :చాగంటివారిపాలెంలో శ్రీమతి షర్మిల మాట్లాడుతూ.. ‘వైయస్ ఉన్నప్పుడు బి.టి. విత్తనాల కంపెనీలకు ముకుతాడు వేశారు. చంద్రబాబు హయాంలో 450 గ్రాముల బి.టి. పత్తి విత్తనాలకు రూ. 1,800 ధర ఉండేది. అవి కూడా రైతులకు సరిపోయినన్ని అందుబాబులో ఉంచకుండా ఒకటి.. అర సంచి ఇచ్చి మిగిలినవి బ్లాక్ మార్కెట్‌కు తరలించి రూ. 2,500 వరకు అమ్ముకునేవారు. వైయస్‌ఆర్ వచ్చాక బి.టి. విత్తనాల ప్యాకెట్ ధరను రూ. 650కు దించారు. రైతులకు ఎన్ని విత్తనాలు కావాల్సి ఉంటే అన్నిటినీ అందుబాటులో ఉంచారు. ఈ విత్తన కంపెనీలు మళ్లీ కిరణ్ పాలనలో జూలు విదులుస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఏ ధరకు విత్తనాలు అమ్మారో.. ఈ రోజు కూడా అదే ధరకు విత్తనాలు అమ్ముతున్నారు. అదీ సరిపోలేదని విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు. కిరణ్ పాలనకు, బాబు పాలనకు తేడా లేదు. ఇది బాబు పాలన రెండో భాగం’ అని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.
అంధకార ప్రదేశ్‌గా చేశారు :‘మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి రైతులను గౌరవించారు. వాళ్లను ప్రేమించారు. రైతులకు ప్రతిదీ చేశారు. విత్తనాల ధరలు దించారు. ఎరువుల ధరలు పెరగనివ్వలేదు. ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్నారు.. ఇచ్చి చూపించారు. ఆయన బతికే ఉంటే ఇవాళ రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. కానీ ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఏడు గంటలు కాదు కదా.. మూడు గంటలు కూడా ఇవ్వడం లేదు. వీళ్లు రానురాను ఉచిత విద్యుత్ కూడా ఎత్తేస్తారేమా’ అని శ్రీమతి షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు. ‘వైయస్‌ఆర్ మన రాష్ట్రాన్ని హరితాంధ్ర ప్రదేశ్‌గా మార్చాలని కలలుగంటే ఈ పాలకులు మన రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్‌గా మార్చేశారు. వైయస్‌ఆర్ హయాంలో రైతులంతా వ్యవసాయం చేసి అప్పుల ఊబి నుంచి బయటికి వస్తే ఇప్పుడున్న పాలకులు మళ్లీ రైతన్నలను అప్పుల ఊబిలోకే నెట్టేశారు. అప్పులు కట్టడం కోసం అన్నదాతలు ఇవాళ కిడ్నీలు అమ్ముకుంటున్న దుస్థితిని మనం చూస్తున్నాం’ అని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.
చంద్రబాబు తీరు... నక్క వాతలు పెట్టుకున్న చందం :‘మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మండే ఎండల్లో 1,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను కళ్ళారా చూశారు. వారి బాధను అర్థం చేసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏమేం చేయాలో అవి చేస్తానని వాగ్దానాలు చేశారు. ‘రాజశేఖరరెడ్డి.. మీరిచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే పాదయాత్రలు కాదు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాలి’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇవాళ అదే చంద్రబాబు పల్లెల వెంట తిరుగుతూ వైయస్ పథకాలను తాను కూడా అమలు చేస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. చంద్రబాబు వాగ్దానాలు చూస్తుంటే ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న’ సామెత గుర్తొస్తోంది. ఎన్ని వాతలు పెట్టుకున్నా.. నక్క పులి అవుతుందా..! పేదలు వెళ్ళే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా యూజర్ చార్జీలు వసూలు చేసిన నీచమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజల రక్తం పిండుకొని తాగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కుమ్మక్కై మళ్లీ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. అందుకే కరెంటు చార్జీలు దారుణంగా పెంచేసినా, కోతలతో ప్రజల్ని చీకట్లోకి నెట్టేస్తున్నా, ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదు’ అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.