మహానేతే మనకు ఆదర్శం

  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏడవ ఆవిర్భావ వేడుకల్లో మేకపాటి
  • ప్రజాస్వామ్యాన్ని అసహాస్యం చేస్తున్న చంద్రబాబు
  • బాబు లాంటి వ్యక్తులను క్షమించకూడదు
  • వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాం
  • ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన మోడీకి అభినందనలు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ పాలనను ప్రజాస్వామ్య పద్దతిలో ఎదుర్కొందాం.. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం.. ఎవరో మనకు ఆదర్శం కాదు.. ఆ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డే మనకు ఆదర్శం. ఆయన అడుగు జాడల్లో నడిచి మరింతగా ప్రజల మన్నలను పొందుదాం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి, సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, కొండా రాఘవరెడ్డి, లక్ష్మీపార్వతి, శివకుమార్, గురునాథ్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. 2011 మార్చి 12వ తేదిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఆరు సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోటులు, ఒడిదొడుకులు ఎదుర్కొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే వ్యక్తి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారని ఎంపీ మేకపాటి విమర్శించారు. 2014లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నా.. చంద్రబాబు చెప్పిన రకరకాల వాగ్ధానాలకు మోసపోయి బాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారన్నారు. 2014 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీకి 67 స్థానాలు వస్తే దాంట్లో నుంచి 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అటువంటి వ్యక్తి రోజు గొప్ప నీతులు చెప్పుకుంటూ ప్రజలను వంచించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్రమోడీకి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభినందనలు తెలుపుతోందని ఉద్ఘాటించారు. కానీ ప్రధానమంత్రి కూడా ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ప్రత్యేక హోదాను మర్చిపోయి ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన వాగ్ధానాన్ని తుంగలో తొక్కడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబు హోదాను మర్చిపోయి స్వార్థ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని దుయ్యబట్టారు. హోదాను మర్చిపోయి ఏపీ అసెంబ్లీ స్థానాల పెంపుకోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి చేటుచేసే ఇలాంటి వ్యక్తులను క్షమించకూడదని ధ్వజమెత్తారు. 

ప్రజాస్వామ్యయుతంగా పోరాడుదాం
2019లో జరగబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని తప్పనిసరిగా గెలిపించాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉందని మేకపాటి అన్నారు. లేనిపక్షంలో చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యమే మంటగలిసే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత వైయస్‌ఆర్‌ చేపట్టిన సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోలేదన్నారు. జననేత వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌ సీపీకి ప్రజల ఆదరణ మెండుగా ఉందని, ఇంకా గొప్పగా ఆదరణ పొందేందుకు ప్రయత్నం చేయాలని, ప్రజాస్వామ్యయుతంగా ముందుకుపోవాలని పార్టీ నాయకులకు సూచించారు. మహానేత వైయస్‌ఆర్‌ అడుగు జాడల్లో నడిస్తే మనకు తప్పనిసరిగా ప్రజల ఆదరణ లభిస్తోందన్నారు. చంద్రబాబును ప్రజాస్వామ్య పద్దతిలోనే ఎదుర్కొందామన్నారు. ప్రజలను వంచించిన వ్యక్తిని తిరిగి ఎన్నుకోరని చంద్రబాబు తెలిసేలా చేద్దామన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకొని రాష్ట్రంలో సువర్ణ పరిపాలన సాగించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 
Back to Top