కేంద్ర వైఖరికి నిరసనగా రాజీనామా: మేకపాటి

ఇచ్చాపురం 04 ఆగస్టు 2013

: తమ పార్టీ శాసన సభ్యుల తీరులోనే తాను కూడా రాజీనామా చేయనున్నట్లు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా సాగుతున్న కుట్రను రాష్ట్ర ప్రజలందరూ భగ్నం చేయగలరనడానికి ప్రస్తుత వాతావరణమే సాక్ష్యమని మేకపాటి చెప్పారు.  'గాడ్ ఈజ్ గ్రేట్.. ప్రకృతికి శతకోటి వందనాలు.. భయంకరమైన వర్షం వస్తుందనుకున్నాం. వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. ఇంతకంటే శుభ సంకేతం ఏం కావాలి?' అని ఆయన ప్రశ్నించారు.  వైయస్ఆర్ తనయ, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం చరిత్రలో ఓ అధ్యాయంగా మిగులుతుందన్నారు. యాత్రంలో శ్రీమతి షర్మిల కోటి మంది ప్రజలను కలిసి మాట్లాడారన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డిని  ఎదుర్కొలేక కాంగ్రెస్, టీడీపీలు వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాజశేఖరరెడ్డిగారు లేని కొరతను ఆయన తీర్చగలరన్నారు. అటువంటి సమయంలో దుర్మార్గంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందన్నారు. ప్రజలు కాంగ్రెస్ ను క్షమించరు. నాయకత్వ కొరత ఉన్న తరుణంలో శ్రీ జగన్ కీలక వ్యక్తవుతారనుకున్న సమయంలో నిర్బంధించారని చెప్పారు. ఒక మహిళ 3112 కిమీ పాదయాత్ర చేయడం అరుదైన విషయమన్నారు. తెలుగు ప్రజలను విభజించి పాలించే యోచనలో కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.

తెలంగాణ ప్రజలకు కూడా రాజన్న అంటే అభిమానమేనన్నారు. వారు లక్షలాదిమంది ఉన్నారు. తెలంగాణ ప్రజలకు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకం చేయాలనే కుట్రలో భాగంగా రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర విభజన అందరి ఆమోదంతో చేయాలని ఇడుపులపాయ సమావేశంలో చెప్పామన్నారు. కేంద్రం చేసిన విభజన నిర్ణయం ప్రజలకు బాధ కలిగించిందన్నారు.  మన పార్టీ శాసన సభ్యులు 16మంది ఇందుకే రాజీనామాలు సమర్పించారని తెలిపారు. వారిలో చిత్తశుద్ధి ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిగారిని ఎదుర్కోలేక చంద్రబాబు సైతం వీరితో కుమ్మక్కయ్యి కుట్ర పన్నారని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడతారనీ, తెలుగు ప్రజల మనోభావాలను అక్కడ చెప్పవచ్చనీ వారం పదిరోజులుగా ఎదురుచూశాననీ, కానీ పెట్టరనే అనుమానమొస్తోందనీ ఆయన తెలిపారు. ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా సోమవారం రాజీనామా చేస్తానని మేకపాటి ప్రకటించారు. వైయస్ఆర్ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగు ప్రజలందరి మీదా ఉందన్నారు. మీరే వారికి శ్రీరామరక్షన్నారు. వీటన్నింటికీ రాబోయే రోజుల్లో ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయనిర్ణేతలనీ, మీరంతా సరైన తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top