బాబు వృథా ఖర్చులో భాగం కాలేను

రాజమండ్రి, 7 జూన్ 2014:

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా చేస్తున్న వృథా ఖర్చులో తాను భాగం కాలేనని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక పక్కన రాష్ట్రం ముక్కలైపోయి, ఆర్థిక వనరులు లేక, ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చంద్రబాబు ఇలా డాబు దర్పాలకు పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేసేలా ఒత్తిడి తీసుకు రావాల్సిన గురుతరమైన బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని శ్రీ జగన్‌ చెప్పారు. రాజమండ్రి ఆర్అండ్‌బీ అతిథిగృహంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

అధికారం కోల్పోయినందుకు తాము సమీక్ష చేయలేదని, సంస్థాగత తప్పులను అధిగమించడంపై చర్చించినట్లు శ్రీ  వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి తెలిపారు. ఓడిన స్థానాల్లో ఎందుకు దెబ్బ తగిలిందో విశ్లేషించుకున్నామని ఆయన చెప్పారు. తాము గతంలో ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు అంధికారంలో ఉండి ఇప్పుడు దానిని కోల్పోలేదన్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి 9 మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలకు తమ పార్టీ బలం తడవ తడబకూ పెరిగిందన్న విషయాన్ని ఆయన తెలిపారు.

రైతు రుణ మాఫీపై చంద్రబాబు నాయుడి తొలి సంతకం డ్రామా అని శ్రీ జగన్ వ్యాఖ్యానించారు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏ తేదీ నుంచి రుణాలు మాఫీ అవుతాయో చెబితేనే తొలి సంతకానికి‌ ఒక అర్థం ఉంటుందన్నారు. రుణమాఫీపై చంద్రబాబు ఓ పథకం ప్రకారం డ్రామా నడిపిస్తున్నారని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఈ ముగ్గురూ ఒక పథకం ప్రకారం చంద్రబాబుకు స్క్రిప్టు రాసి పంపిస్తారని, చంద్రబాబు మంచోడని, రుణ మాఫీ చేయాలన్న సదుద్దేశం ఆయనకు ఉందని, అయితే మాఫీ చేసే పరిస్థితులు లేని కారణంగానే చేయలేకపోతున్నారంటూ యెల్లో మీడియా డ్రామా సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. కొత్త రాజధానికి డబ్బులు లేవంటూ ఒక వైపున చందాలు అడుగుతున్న చంద్రబాబు నాయుడు మరోవైపున తనకు అందిన ప్రాథామిక సమాచారం ప్రకారం ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారని శ్రీ జగన్ విమర్శించారు.‌

రాష్ట్రం కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో అంత ఖర్చు చేయడం ఎందుకని శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం రూ.5 వేలు, రూ.10 వేలు, రూ. 20 వేలు విరాళాలు అడుగున్న చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి అంత ఖర్చు చేయడం అంటే దాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని శ్రీ జగన్‌ అన్నారు. అలాంటి దుబారా కార్యక్రమానికి తాను వెళ్లాల్సిన అవసరం లేదని శ్రీ జగన్ అన్నారు. ఆ వృ‌థా ఖర్చులో తాను భాగస్వామిని కాలేనని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపైనా పోరాడతామని శ్రీ వైయస్‌ జగన్ తెలిపారు.

Back to Top