ప్రత్యేక హోదా రాకపోవటానికి కారకుడు చంద్రబాబే..!

హైదరాబాద్: విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఊరట ప్రత్యేక హోదా తోనే అని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీ అమలు కాకపోవటానికి చంద్రబాబు కారణమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. ఏడు రోజుల కఠిన నిరవధిక నిరాహార దీక్ష, తర్వాత ఆసుపత్రిలో చికిత్స తర్వాత హైదరాబాద్ లోని నివాసంలో జాతీయ వార్తా సంస్థ ఏఎన్ ఐ కు జగన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..

ఏడు రోజుల నిరవధిక నిరాహార దీక్షకు నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు వేదికగా అధికార పక్షం, మొత్తం ప్రతిపక్షం మూకుమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న హామీతో కలిపి రాష్ట్ర విభజన కోసం ఓటు వేశాయి. నిండుసభలో ఇచ్చిన హామీ నే ఉల్లంఘిస్తే ఇక పార్లమెంటుకి ఉన్న విశ్వసనీయత ఏమిటి..!

ఇది మేం బయట పెడుతున్న ప్రాథమిక ప్రశ్న.

అలనాడు పార్లమెంటులో అన్ని పక్షాలు అంగీకరించిన సత్యం ఏమిటంటే.. రాష్ట్ర విభజనతో, అంటే హైదరాబాద్ ను వదులుకోవటంతో ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఎందుకంటే 60శాతం రెవిన్యూ అక్కడ నుంచే వస్తుంది. 90 శాతానికి పైగా సాఫ్ట్ వేర్ సంస్థలు, 70 శాతానికి పైగా ఉత్పాదక పరిశ్రమలు.. వీటిలో ఉండే ఉద్యోగాలు హైదరాబాద్ లోనే ఉన్నాయి. అటువంటి హైదరాబాద్ ను వేరు చేయటం కారణంగా, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించటం వల్ల ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గుర్తించారు. ఇదే సందర్భంలో  ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి అని చెబుతున్నారు. ఇది ఎంత వరకు సత్యం అన్నది అర్థం కావటం లేదు. రాష్ట్ర విభజన సమయంలో  రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది అని గుర్తించారు కాబట్టి అనేక అంశాల్ని ఈ చట్టంలో పొందుపరిచారు.

పోలవరం ఖర్చు భరిస్తామనటం, రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామనటం, విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామనటం, రోడ్లు వేస్తామనటం, విమానాశ్రయాల్ని అంతర్జాతీయ స్థాయికి ఆధునీకరిస్తామనటం .. ఇవన్నీ ఈ కోవలోనివే. ఇవన్నీ కలిపి కట్ట కట్టి దానికి ఒక కొత్త పేరు మార్చి ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ఇస్తున్నారు. అవే అంశాలకు సంబంధించిన నిదుల్ని కలిపేసి, వాటిని ప్రత్యేక ప్యాకేజీలుగా ఇవ్వటం ఎంత వరకు భావ్యం అని నేను అడుగుతున్నా.

ఒక వైపు ప్రత్యేక హోదా ఇవ్వం అంటున్నారు. మరో వైపు దీని మీద అబద్దాలు ఆడుతూ. ..మోసాలు చేస్తున్నారు. ఇదంతా మోసం కాదా అని అడుగుతున్నా. మాకు ఆశ కొనసాగుతోంది. మా పోరాటం  కొనసాగుతుంది. వాస్తవానికి  ఈ పోరాటం చంద్రబాబు చేయాలి.

మా దురద్రష్టం ఏమిటంటే ఆయన ఈ పోరాటం చేయటం లేదు. చంద్రబాబు ఎందుకు ఈ పోరు చేయటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అడిగి ఒత్తిడి చేయాలి. ఈ బాధ్యతను వదిలేశారు. అసలు చంద్రబాబు కేంద్రానికి ఎందుకు ఒక అల్టిమేటమ్ ఇవ్వటం లేదు. 18 నెలలు గడిచిపోయాయి. ప్రత్యేక హోదా ఇస్తారా లేదా..అని ఒక నెల గడువు పెట్టి అల్టిమేటమ్ ఇవ్వచ్చు కదా. గడువు లోగా ఇవ్వలేకపోతే కేంద్రం నుంచి మా మంత్రుల్ని ఉపసంహరించుకొంటాం అని చెప్పవచ్చు కదా.

చంద్రబాబు ఎందుచేత కేంద్రం మీద ఒత్తిడి చేయలేకపోతున్నారు. ఒకే ఒక్క కారణం..చంద్రబాబు ఓటుకి కోట్లు కుంభకోణంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆడియో వీడియో టేపులతో సహా బహిరంగంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అడ్డ గోలుగా దోచుకొని ఈ అవినీతి సొమ్ముతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. అందుచేత దీని నుంచి బయట పడేందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం లేదు. 
Back to Top