ప్రాణం ఉన్నంతవరకు వైయస్ కుటుంబంతోనే

వైయస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం
పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా
 ఫిరాయింపులు అనైతికం, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
వైయస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి విజయసాయిరెడ్డి

హైదరాబాద్ః రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో , ఢిల్లీలో పార్టీ వాణిని వినిపించి...పార్టీ ప్రాబల్యం పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.  ఏపీ అసెంబ్లీలో  పార్టీ నేతలతో కలిసి వైయస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ...వైయస్ కుటుంబంతో తనకు మూడు తరాల అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. తన ప్రాణం ఉన్నతవరకూ వైయస్ కుటుంబంతోనే ఉంటానని అన్నారు. విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వం పట్ల పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. 

పునర్విభజన చట్టంలో పొందు పర్చిన అంశాలను, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తమ అధ్యక్షులు వైయస్ జగన్ రెండేళ్లుగా పోరాడుతున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వాటిని అమలు పర్చేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఇక పార్టీ నుంచి తొలి సభ్యునిగా రాజ్యసభకు వెళుతుండడం సంతోషదాయకమన్నారు. 

పార్టీ ఫిరాయింపులు అనైతికం, చట్టవిరుద్ధమని విజయసాయిరెడ్డి అన్నారు. మిగతా రాజకీయ పార్టీలన్నీ అభివర్ణించినట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నది ముమ్మాటికే రాజకీయ వ్యభిచారమేనని అన్నారు.  రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం  అప్రజాస్వామికమన్నారు. ఫిరాయింపుదారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణే రాజీనామా చేసి ప్రజాతీర్పుకు సిద్ధం కావాలన్నారు.  


Back to Top