కోట్లకు అమ్ముడు పోయే వ్యక్తిని కాను

టీడీపీ పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలే
బాబు హామీలు మరచి దేశాలు తిరుగుతున్నాడు
వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నాడు
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నాడు
వైఎస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యంః జంకె

ప్రకాశం(దర్శి): తాను కోట్లకు అమ్ముడుపోయే ఎమ్మెల్యేను కానని ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా వైఎస్  జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాల్సిందేనన్నారు. రాజంపల్లి ఆంజనేయస్వామి తిరునాళ్లలో ..పొదిలి మండలం కుంచేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభపై ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం దర్శి మండలం లక్ష్మీనారాయణపురం ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హాజరయ్యారు. 

ప్రస్తుత పాలనలో బాబు వచ్చాడు జాబు పోయిందని, గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నిధులు పక్కదారి మళ్లించడంతో కనీసం బోర్లు ఎండిన చోట మరమ్మతులు చేయించే పరిస్థితులు కూడా లేవన్నారు. ఎన్నికల హామీలు మరిచి ప్రత్యేక విమానాల్లో దేశాలు తిరుగుతూ బాబు వందల కోట్లు వృథా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో శాసనసభ్యులకు కోట్లు కుమ్మరించి కొంటున్నారని ధ్వజమెత్తారు. 

ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు వద్దకు రావడం.. వెళ్లడం తప్ప.. చేసింది ఏమీ లేదన్నారు. కరువుతో రైతులు కన్నీరు పెడుతున్నారని, పల్లెలు గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నాయని, యువత ఉద్యోగాలు, ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్నారని, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారందరూ చంద్రబాబుకు ఎందుకు ఓట్లేసి గెలిపించామా అని బాధపడుతున్నారని చెప్పారు. యువకుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రజల కోసం ఎంతో తపిస్తుంటారని, అటువంటి యువ నాయకుడికి అందరూ ఎల్లవేళలా అండగా ఉండాలని కోరారు. వైఎస్సార్ రామరాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాల్సిందేనని జంకె పునరుద్ఘాటించారు.
 
Back to Top