సమైక్య శంఖారావానికి పోటెత్తిన జన ప్రవాహం

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనుకున్న కాంగ్రెస్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధానిలో సమైక్యవాదం, నినాదం హోరెత్తుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన వాన బీభత్సం కూడా వారి ‘సమైక్యాంధ్ర’ ఆకాంక్షను నీరుగార్చలేకపోయింది. ఇళ్లు, పొలాలను ముంచెత్తిన వరద వారిని సమైక్యాంధ్ర ఉద్యమపథం నుంచి పక్కకు మళ్లించలేకపోయింది. అందుకే.. ప్రకృతి ప్రకోపాన్ని కూడా లెక్క చేయకుండా భావి తరాల బాగు కోసం.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం రైళ్ళు, ప్రత్యేక రైళ్ళు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో ప్రవాహంలా హైదరాబాద్కు‌ ప్రజలు తరలి వచ్చారు.

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభకు రాష్ట్రం నలు మూల నుంచి భారీ ఎత్తున సమైక్య వాదులు తరలివచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమైక్య శంఖారావం సభ మొదలవుతుంది. అయితే శనివారం ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచీ తరలి వచ్చిన సమైక్యవాదులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మరోవైపున సమైక్య సభకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మిక సంఘాలు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి.

కాగా, శనివారం ఉదయం కూడా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ సమైక్య శంఖారావం సభ ప్రారంభానికి రెండు గంటల ముందు మధ్యాహ్నం 12 గంటల నుంచీ ఎండ కాస్తోంది. సభకు తరలివస్తున్న అభిమానులు, సమైక్య వాదులంతా ఎండను చూసి హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికే ఎల్బీ స్టేడియంలోని గ్యాలరీలు మొత్తం సమైక్య వాదులతో పూర్తిగా నిండిపోయాయి.

Back to Top