‘నిరుద్యోగ భృతి’కి మంగళం

తనను నమ్ముకుంటే ఎలా మోసపోతారో చంద్రబాబు మరోసారి చేసి చూపించాడు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నిరుద్యోగులందరికీ ఒక్కొక్కరికి నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు సర్కారు రెండున్నరేళ్ల తర్వాత మాటతప్పింది. నిరుద్యోగులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పథకానికి మంగళం పాడింది. ఏ ముహూర్తాన అమరావతిలోని తన నూతన కార్యాలయానికి మారాడో కానీ అచ్చెన్నాయుడు నిరుద్యోగలపై కక్ష పెంచుకున్నట్టుగా మొదటి సంతకమే నిరుద్యోగి భృతిని రద్దు చేస్తున్నామంటూ ప్రకటించాడు. నిరుద్యోగ భృతి ఇవ్వడం తమకు సాధ్యం కాదని ప్రకటించింది. రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఉచిత పథకాలు అభివృద్ధికి ఆటంకాలుగా అభివర్ణించింది. నిరుద్యోగ భృతి నారా లోకేష్‌ ఆలోచనగా ఆనాడు ప్రచారం చేసుకున్న బాబు ఈనాడు నిరుద్యోగులు ఖజానాకు భారమయ్యారంటూ సెలవిచ్చారు. ఇన్నాళ్లు చంద్రబాబును, ఆయన పాలనను పొగుడుతూ ప్రచారం చేసుకుంటున్న పచ్చ మీడియాకు ఈ అనుకోని పరిణామంతో ఎలా ప్రచారం చేసుకోవాలో అర్థమైనట్టు కనిపించడం లేదు. 
ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే 
ఎన్నికల ప్రచారంలో ఉచితాలతో విచ్చలవిడిగా రెచ్చిపోయిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉచితాలకు ఒక్కొక్కటిగా మంగళం పాడుతూ సర్దుకు పోవాలని ఉచిత సలహాలిస్తున్నాడు. రెండున్నరేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అంటూ హడావుడి చేసిన చంద్రబాబు సర్కారు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తుంది. ఎన్నికల్లో ప్రముఖంగా ప్రచారం చేసుకుని నిరుద్యోగుల ఓట్లు సాధించిపెట్టిన నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టకుండానే రద్దు చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంతకం చేశాడు. ఏపీ చరిత్రలో ప్రారంభం కాకుండానే రద్దయిన మొదటి పథకం కూడా ఇదేనేమో. ఆరంభమే అపశకునంతో మొదలైనట్టు ఏ ముహూర్తాన మంత్రుల కార్యాలయాలు అమరావతికి వచ్చాయోగానీ ఇలాంటి వార్త విన్నామని ఏపీ ప్రజలు, నిరుద్యోగులు వాపోతున్నారు. సీఎంగా మొదటి సంతకాలు చేసిన ఒక్కొక్క పథకానికి మంగళం పాడేస్తున్నా చంద్రబాబులో కించిత్‌ పశ్చాత్తాపం కూడా కనబడకపోవడం దారుణం. 
 Back to Top