మహిళల పట్ల మీ దృక్పథం మారకుండా భద్రత ఎలా సాధ్యం?

పంట భూములను చూస్తే ప్రాణం
లేచొచ్చినట్టుంటుంది. మట్టిని పిసికే రైతన్నల చలవతోనే కదా మన నోటికాడికి ఐదు
వేళ్లు వెళ్లేదన్న స్పృహ మనసును కదిలిస్తుంటుంది. మరి అలాంటి అన్నదాతకు ఈవేళ
ఎందుకింత కష్టం? ఎందుకింత
నష్టం? ఓ
వైపు ఎండలు మండుతుంటే... మరో వైపు ‘మా గుండె మంటల కన్నానా?’ అన్నట్టుగా రగిలిపోతూ
కనిపించారు అంగలూరు దగ్గర రైతన్నలు. ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహ
జ్వాలలతో మండిపడ్డ ఆ అన్నదాతలు వరి ధాన్యం, మినుము కుప్పలు రోడ్డు మీదే
పోసి నిప్పంటించారు. దగాపడుతున్నాం... దోపిడీకి గురవుతున్నామంటున్న వారిని
వారించేదెవరు? ఓదార్చేదెవరు? భరోసానిచ్చేదెవరు? ఇవన్నీ చేయాల్సిన
ప్రభుత్వమే... అసలు దోషి కావడంతో కంచే చేను మేసిన పరిస్థితి. ఆ రైతన్నలతో
మాట్లాడాను.

దగ్ధమైపోతున్న
ధాన్యం, మినుము
కుప్పల సాక్షిగా... ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ... ఆరుగాలం పండించిన పంటను
తగులబెట్టుకున్నామంటూ తమకొచ్చిన కష్టం గురించి చెప్పుకున్నారు. ‘నీళ్లు లేక, తెగుళ్ల బారినపడి, దిగుబడి తగ్గి, గిట్టుబాటు ధరల్లేక సగం
చచ్చిన మమ్మల్ని... ఇప్పుడు పండిన ఆ కొద్దిపాటి పంటకు మద్దతు ధర అందకుండా
చేస్తూ... పార్టీ వివక్షతో, మా
కష్టార్జితాన్ని తెలుగుదేశం దళారుల పాలు చేస్తున్నారు’ అంటూ ఆక్రోశం వెలిబుచ్చారు.
అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయి అవమాన భారాన్ని మోస్తున్న రైతన్నల ఆత్మస్థైర్యాన్ని
దెబ్బతీస్తే వారు మనుగడ సాగించేదెలా? రైతులకు భరోసానిస్తూ...
ధైర్యాన్ని నూరిపోస్తేనే కదా వ్యవసాయం వెలుగులీనేది. వారితో అదేమాట చెప్పాను. జాతికి
వెన్నెముకలాంటి మీ వెంటే ఉంటానంటూ గట్టిగా హామీనిచ్చాను. 

 ‘నీలాగే
మీ నాన్నగారు మంచి ఎండలో నడిచాడయ్యా! అమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు..
ప్రజలంటే ఎంతో ప్రేమ. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆయనే గుర్తొస్తున్నాడు. అదే ప్రేమ, అదే పలకరింపు, అదే ధైర్యం, అదే కష్టం’ అంటూ లక్ష్మీరంగనాయకమ్మ అనే
పెద్దమ్మ చెబుతూ ఉంటే ఎంతో గర్వంగా అనిపించింది. ప్రజల కోసం పరితపించడమంటే...
శిరసు ఎత్తుకుని ముందుకు సాగడమే కదా!

బంజారా
సేవా సంఘం సభ్యురాలైన బాణావత్‌ ఇందిరా రాణి ‘ఈ ప్రభుత్వానికి
గిరిజనులంటే చిన్నచూపు. తీవ్ర వివక్ష చూపుతోంది. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు.
నామినేటెడ్‌ పదవులూ లేవు. ఎస్టీ కార్పొరేషన్‌కు చైర్మన్‌ లేడు. చివరికి గిరిజన
సలహా మండలి చైర్మన్‌ కూడా గిరిజనేతరుడే’ అంటూ బాబుగారి పాలనపై
విమర్శనాస్త్రాలు సంధించింది. గిరిజన సలహా మండలిలో తన తాబేదార్లనే సభ్యులుగా
నియమించుకుని దాన్ని కూడా మరో జన్మభూమి కమిటీలా తయారుచేశాడట. దళితులన్నా, గిరిజనులన్నా, బలహీనవర్గాలన్నా హీనమైన
భావనలున్న చంద్రబాబు నుంచి ఆ వర్గాల అభ్యున్నతిని ఎలా ఆశించగలం? 

‘ఆడ
బిడ్డలకు రక్షగా కదులుదాం’ అంటూ
ముఖ్యమంత్రిగారు ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఆడబిడ్డకు రక్ష కావాలంటే.. మొదట మహిళల
పట్ల ఆయన దృక్పథం మారాలి. మహిళలపై దౌర్జన్యాలకు, అకృత్యాలకు పాల్పడ్డ తన
పార్టీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఆయనకు కాస్తయినా విశ్వసనీయత ఉండేది.
అవేమీ చేయకుండా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి చేసే ఈ
కార్యక్రమాలు ఆయనగారి ‘ధర్మపోరాట
దీక్ష’లాగా
మరో ప్రహసనంగా మిగిలిపోతాయి. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ ఈ నాలుగేళ్ల పాలనలో
మహిళలపై జరిగిన అకృత్యాలపై మూడు వేలకుపైగా కేసులు నమోదైతే ఏ ఒక్కరోజైనా
స్పందించారా? ప్రధాన
ప్రతిపక్షమైన మేము మీ నేరపూరిత నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బాధితుల పక్షాన గట్టిగా
నిలబడిన ఈ తరుణంలో... ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న మొక్కుబడి
కార్యక్రమాలు కపట ప్రేమ కాదా?  

వైఎస్‌ జగన్‌ 

తాజా ఫోటోలు

Back to Top