ఇంకా ఎంతకాలం మోసం చేస్తావ్‌ బాబూ?

  • నంద్యాలలో తన అబద్ధాల చిట్టాను విప్పుతున్న చంద్రబాబు
  • రైతాంగాన్ని కుదేలు చేసిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
నంద్యాల: రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెబుతూ ఇంకా ఎంత కాలం మోసం చేస్తావు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ప్రశ్నించారు. వాల్మీకి, రజకులను ఎస్టీల్లో చేర్చుతానని, ఇంకా అనేక ఇతర కులాలను ఎస్సీలు, ఎస్టీలుగా మార్చుతానని చెప్పావ్.  కనీసం వీటిపై చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. నంద్యాలలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాల్మీకి, రజకులను ఎస్టీల్లో చేర్చాలని మీ భాగస్వామ్య ప్రభుత్వమైన కేంద్రంతో సంప్రదింపులు జరిపారా అని నిలదీశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా మళ్లీ అబద్ధపు హామీల చిట్టాలను నంద్యాల ప్రజలపై గుప్పిస్తున్నాడని మండిపడ్డారు. ఇంకా ఎంత కాలం ప్రజలను మోసం చేస్తావని ప్రశ్నించారు. 

బలహీనవర్గాలకు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా..?
బ్యాంకుల్లో రైతుకు ఒక్క రూపాయి రుణం దొరక్కుండా చేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని పార్థసారధి విమర్శించారు. రాష్ట్రంలో బలహీనవర్గాల ప్రజలంతా వ్యవసాయంపై ఆధారాపడి జీవిస్తున్నారని, బాబు వ్యవసాయాన్ని ఏ విధంగా కుదేలు చేశాడో అందరికీ అర్థం అయిపోయిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతాంగానికి వేల కోట్ల రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఈ రోజున రైతుకు రూపాయి కూడా దొరక్కుండా చేసింది నువ్వు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. కౌలు రైతులు కూడా బ్యాంక్‌ల దగ్గరకు వెళ్లి రుణాలు తెచ్చుకునేవారన్నారు. కానీ బాబు దౌర్భాగ్యం, అబద్ధాల హామీల మూలంగా రుణాలు ఇవ్వకుండా వెళ్లగొడుతున్నారన్నారు. కాంట్రాక్టర్‌లకు నష్టాలు జరిగితే వెంటనే స్పందిస్తారు కానీ, రైతులు పంట నష్టపోతే పరిహారం ఇవ్వడానికి చేతులు రావా అని బాబును నిలదీశారు. బలహీనవర్గాలకు సబ్‌ప్లాన్‌ రూ. 10 వేల కోట్లు అన్నారు. ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని ధ్వజమెత్తారు. నంద్యాలలో ఎన్నికలు రాగానే బలహీనవర్గాల పట్ల ప్రేమ వలకబోస్తుంటే నమ్మడానికి వారు పిచ్చివారు కాదన్నారు. 

రోడ్లు పగలగొడితే అభివృద్ధి అంటారా: ఎమ్మెల్యే కోన
రోడ్లు పగలగొట్టి అభివృద్ధి అంటూ నంద్యాలలో టీడీపీ దుర్మార్గపు కార్యక్రమం చేస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. జనాభా పెరుగుదలకు అనుగూనంగా ఏ ప్రభుత్వాలైనా రోడ్ల విస్తరణ చేపడుతాయన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాలను జిల్లా చేస్తానని ప్రకటించారన్నారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి అని, నంద్యాల ప్రజానికం వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. నంద్యాల జిల్లా అయితే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. 
Back to Top