ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారు?

శ్రీకాకుళం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు అన్నారు. శ్రీకాకుళంలోని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇపుడు విడతల వారీ అంటూ వారిని మోసగించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.  ఆరు మాసాల పాటు రాత్రనక, పగలనక రైతు కష్టపడి పంట పండిస్తే పండిన పంటకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించకపోవడం దారుణమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని కొనుగోలు చేయకుండా చోద్యం చూడడం దారుణమన్నారు. రైతులకు రావాల్సిన రవాణా ఛార్జీలు కూడా ఇప్పటికీ ఇవ్వలేదని, గోనెసంచుల అవినీతిలో టీడీపీ నాయకులే భాగస్వాములని, వారు చేసిన అవినీతిపై పలు పత్రికల్లో కథనాలు కూడా ప్రచురించిన విషయాన్ని గుర్తు చేశారు. 

Back to Top