చంద్రబాబు ఏ మొహంతో ఆత్మగౌరవయాత్ర చేస్తారు

హైదరాబాద్ 20 ఆగస్టు 2013:

తెలుగు జాతి ఆత్మగౌరవయాత్ర చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చేపట్టాల్సింది తెలుగు జాతి విధ్వంస యాత్రని చెప్పారు. టీడీపీ పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావుపై  చెప్పులేయించిన నాడే చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవానికి వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆనాడే తెలుగు జాతి చంద్రబాబుగారికి బుద్ధిచెప్పాలని భావించి ఉంటే ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పుడీ  పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఎవ్వరికీ రానివిధంగా తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభించినప్పటికీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఈ తెలుగు జాతిని రెండుగా చీల్చేయాలని చంద్రబాబు ఆరుసార్లు ఓ గండ్ర గొడ్డలిని కేంద్ర ప్రభుత్వానికీ, సోనియాగాంధీకి అందించారని చెప్పారు. 2008 ఎన్నికలకు ముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చారనీ, 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చారనీ, 2012 డిసెంబరు 6వ తేదీన అసెంబ్లీలో తెలుగు జాతిని విడగొట్టమనీ, తరువాతి రోజునే అంటే డిసెంబరు 7న అఖిలపక్షానికి సైతం ఇదే అంశాన్ని తెలిపారనీ, ఎవరూ అడక్కపోయినప్పటికీ అదే ఏడాది సెప్టెంబర్ 25న హోం మంత్రికి రాష్ట్రాన్ని విడగొట్టమని లేఖ రాశారనీ, డిసెంబరులో జరిగిన మరో అఖిల పక్ష సమావేశంలో మళ్ళీ రాష్ట్ర విభనను కోరారనీ ప్రవీణ్ కుమార్ వివరించారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

సమైక్యతకు చిరునామా వైయస్ఆర్
కొందరు స్వార్థపరులను లోబరుచుకుని భారత దేశాన్ని బ్రిటిషర్లు ఎలాగైతే ఆక్రమించుకున్న చరిత్ర ప్రస్తుతం పునరావృతమవుతోందని ప్రవీణ్ చెప్పారు. తెలుగు జాతి విచ్ఛిన్నానికి ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీకి చంద్రబాబు సహకరిస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలుగు జాతికి శత్రువుగా, ద్రోహిగా చంద్రబాబు నిలబడిపోతారన్నారు. తెలుగు జాతికి క్షమాపణలు చెప్పి పక్కకు తప్పుకోవాల్సిన తరుణంలో ఆయన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌పై అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమైక్యతకు, సమగ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్న వ్యక్తి వైయస్ఆర్ అని స్పష్టంచేశారు. రాష్ట్ర సమైక్యతకు ఆయన చిరునామా అని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు బీజం వేసింది రాజశేఖరరెడ్డిగారని అభాండం మోపడం దుర్మార్గమన్నారు. మహానేత జీవించి ఉండగా తెలుగుజాతిని చీల్చడానికి సోనియా గాంధీ గానీ, టీఆర్ఎస్ గానీ కలలో కూడా ఆలోచించలేకపోయాయన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజశేఖరరెడ్డిగారి వైపు కనీసం చూసి మాట్లాడలేకపోయేవారన్నారు. రాజశేఖరరెడ్డిగారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ అభివృద్ధి కోణంతోనే చూశారని తెలిపారు. తెలంగాణ ప్రజల మనసుల్లోకి విడిపోవాలనే ఆలోచన కూడా రాకుండా మహానేత పరిపాలించారని చెప్పారు. ఉద్యమాలను చేసే అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వలేదని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం చంద్రబాబు బిడ్డ

ప్రస్తుతం సాగింది తెలంగాణ వెనుకబాటుతనమో, అన్యాయం జరిగిందనో ఉద్యమాలు సాగలేదన్నారు. చంద్రబాబు సృష్టించిన అరాచక విధానాల వల్ల, చేసిన అన్యాయాల వల్ల తెలంగాణ ఉద్యమం పుట్టిందని ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు. ఇంద్రారెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అన్యాయాలను సహించలేక ఉద్యమాలను చేశారని చెప్పారు. ఉద్యమం పుట్టింది రాజశేఖరరెడ్డి గారి వల్ల కానే కాదని ఆయన విస్పష్టంగా తెలిపారు. తెలంగాణ ఉద్యమం చంద్రబాబు బిడ్డని అభివర్ణించారు.

బాబు చేపట్టాల్సింది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే యాత్ర

గాంధీని చంపిన గాడ్సేకు దేశ ప్రజల మనసుల్లో ఎలాగైతే స్థానం లేదో... చంద్రబాబుకు కూడా రాష్ట్ర ప్రజల మనసుల్లో స్థానముండదని చెప్పారు. గాడ్సే మాదిరిగానే చంద్రబాబును కూడా తెలుగు ప్రజలు క్షమించరన్నారు. విభజనకు కారణమై, నాలుగు లక్షల కోట్లకు తెలుగు ప్రజలను అమ్మేసిన చంద్రబాబు అదే ప్రజల వద్దకు వెళ్ళి ఏం చేయాలో అడుగుతాననడాన్ని ప్రవీణ్ ఎద్దేవా చేశారు. చందాలు వేసుకుని ఆ మొత్తాన్ని ఇచ్చి, నిన్ను దేశం నుంచి సాగనంపడానికి తెలుగు జాతి సిద్ధంగా ఉంది చంద్రబాబూ అని హెచ్చరించారు.  ఎందుకంటే కలిసుండాలన్న ఆకాంక్షను చిదిమేసినందుకేనని చెప్పారు. విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతోందని పత్రికల్లో రావడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని ప్రవీణ్ తెలిపారు. అదే రోజు టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాజీనామా చేసుంటే విభజన నిర్ణయం వచ్చి ఉండేది కాదన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేస్తూ, దీక్షలు చేయడం ప్రజలను మోసగించడమేనని చెప్పారు. చంద్రబాబు చేపట్టాల్సింది ఇప్పుడు తెలుగు జాతి వంచన యాత్ర,, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే యాత్ర,, తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని అమ్ముకునే యాత్ర చేయాలని సూచించారు.

సోనియాకు ఏ శిక్ష వేయాలి

చెట్టును నరికిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని నిన్న సీఎం చెప్పారనీ, మరి అరవై ఏళ్ళ పాటు పెంచిన తెలుగు జాతి అనే మహా వృక్షాన్ని అడ్డంగా నరికేసిన సోనియా గాంధీకి ఏ శిక్ష వేయాలో కూడా ఆయనే సూచించాలనీ ప్రవీణ్ కోరారు. దీనికి గండ్రగొడ్డలిని అందించిన చంద్రబాబుకు కూడా కచ్చితంగా యావజ్జీవ శిక్ష విధించాలన్నారు. వీళ్లిద్దరూ ఎన్ని జన్మలెత్తినా పట్టుకొచ్చి శిక్ష వేయాల్సిన అవసరముందన్నారు. అప్పుడు తప్ప ఈ తెలుగు జాతి గుండెల్లో రగిలిన జ్వాల ఆరదని ప్రవీణ్ కుమార్ చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top