హిట్లర్‌కు బాబుకు దగ్గర పోలిక

–చంద్రబాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
–స్పీకర్‌పై నమ్మకం, గౌరవం పోయాయి..అవిశ్వాస తీర్మానం పెడతాం
–స్పీకర్‌కు తెలియకుండా అసెంబ్లీ వీడియోలు దొంగిలిస్తే ఆయన ప్రతిష్టకు భంగకలుగలేదా?
–స్పీకర్‌ ప్రెస్‌మీట్‌ను సాక్షి ఒక్కటే కాదు మిగతా చానళ్లు ప్రసారం చేశాయి
–ఆ చానళ్ల క్లిప్పింగ్‌లు సభలో ప్లే చేయరా?
––అగ్రిగోల్డు టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు ప్రభుత్వం అష్టకష్టాలు
–తక్కువ ధరకు అగ్రిగోల్డు ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేశారు
–అగ్రిగోల్డు చైర్మన్‌ సోదరుడు, ఆయన భార్య, కూతురు భూములు విక్రయిస్తున్నారు
–ప్రివిలేజ్‌ కమిటీలాగే హౌస్‌ కమిటీ ఉంటుంది
–దమ్మూ, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్డితో జ్యుడీషియల్‌ విచారణ జరపాలి

ఏపీ అసెంబ్లీ:  ముఖ్యమంత్రి చంద్రబాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, సభలో కొత్త సంప్రదాయానికి తెర లేపారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో అగ్రిగోల్డు బాధితుల సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం అష్టకష్టాలు పడింది. ఎప్పుడో స్పీకర్‌ ఇచ్చిన ప్రెస్‌మీట్‌ను వక్రీకరించారని సాక్షి దినపత్రికపై కక్షసాధింపు చర్యలకు పాల్పడేందుకు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ అసెంబ్లీలో సాక్షి కథనాన్ని టెలీకాస్ట్‌ చేయడం పట్ల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..చంద్రబాబును హిట్లర్‌తో పోల్చారు. చంద్రబాబు డైరెక్షన్, కాల్వ శ్రీనివాసులు యాక్షన్, ఆ వెంటనే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు  రియాక్షన్‌ తీసుకుంటున్నారని వైయస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు తెలియకుండానే సభలోని వీడియో టేపులు బయటకే వెళ్తే అప్పుడు పోని పరువు, ప్రతిష్టలు ఆయన మాట్లాడిన అంశాన్ని మిగతా చానళ్లతో పాటు సాక్షి పత్రిక చూపిందని చెప్పారు. స్పీకర్‌పై ఉన్న గౌరవం, విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే కోడెలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు వైయస్‌ జగన్‌ వెల్లడించారు

స్పీకర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా?
బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న స్పీకర్‌ ఆడవాళ్లను అవహేళనగా మాట్లాడవచ్చా, స్పీకర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. గతంలో స్పీకర్‌ ప్రెస్‌మీట్‌లో ‘‘కారు షెడ్లలో ఉండాలి, ఆడవాళ్లు వంటింట్లో ఉండాలి’’ అన్న మాటలు ఇవాళ అసెంబ్లీలో చర్చకు వచ్చాయన్నారు. స్పీకర్‌ ప్రెస్‌మీట్‌ను సాక్షితో జాతీయ మీడియా కూడా  కవర్‌ చేశాయని తెలిపారు.  ఇండియా టుడే, డెక్కన్‌ క్రానికల్, డీఎన్‌ఏ, గ్రేట్‌ ఆంధ్ర, టీవీ9, ఎన్‌టీవీ ఇలా అందరు పబ్లిష్‌ చేశార ని తెలిపారు. ఇన్ని చానళ్లు టెలికాస్ట్‌ చేస్తే ఇవాళ సాక్షి ఒక్కటే చేసినట్లు దాన్ని టీవీలో చూపడానికి సభా సమయానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డు విషయాన్ని పక్కనపెట్టేందుకు  సభకు సంబంధం లేని విషయాన్ని అసందర్భంగా ఇవాళ టెలికాస్ట్‌ చేశారని తప్పుపట్టారు. ప్రజాస్వామ్యం బతకాలంటే అందరూ ఒకతాటిపైకి రావాలని వైయస్‌ జగన్‌ కోరారు. టీడీపీకి టీవీ చానళ్లు, పేపర్లు నచ్చకపోతే ఇష్టమొచ్చినట్లుగా చర్యలు తీసుకుంటుపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటుకు కోట్లు కేసు టేపులు ప్రసారం చేయాలనిపించలేదా?
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోతే ఆ టేపులు అసెంబ్లీలో ప్రసారం చేయాలని స్పీకర్‌కు అనిపించలేదా అని వైయస్‌ జగన్‌ నిలదీశారు.  ఇవే టీవీ చానళ్లు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రసారం చేయలేదని చెప్పారు. పోరెన్సిక్‌ రిపోర్టు కూడా ఆ గొంతు చంద్రబాబుదే అని నిర్ధారించినా ఆ టేపులు ప్లే చేయాలని స్పీకర్‌కు అనిపించలేదు. సభకు సంబంధం లేని  అంశంపై, ఆడవాళ్లను అవహేళనగా మాట్లాడిన అంశాలపై అన్ని చానళ్లతో పాటు సాక్షి ప్రసారం చేస్తే..ఒక్క సాక్షిపైనే చర్యలకు ముందుకు రావడం దారుణమన్నారు.

అగ్రిగోల్డు అంశాన్ని పక్కనపెట్టి..
అగ్రిగోల్డు బాధితుల సమస్యలపై పభలో చర్చించాల్సింది పోయి ఈ విషయాన్ని పక్కనపెట్టేశారని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మండిపడ్డారు.  బాధితులకు మేలు చేసే ఆలోచన కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. మన రాష్ట్రంలో 19 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని, కేవలం రూ.1180 కోట్లు చెల్లిస్తే 13 లక్షల మంది డిపాజిటర్లు బయట పడుతారని తెలిపారు. అగ్రిగోల్డుకు రూ.7600 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాÆయని, ఏడాదిన్నరగా ఈ ఆస్తులను అమ్మే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే ఆస్తులు అమ్మారని తెలిపారు. ఆగ్రిగోల్డు ఆస్తులను ఆ సంస్థ చైర్మన్‌ సోదరుడు బయట ఉంటూ విక్రయిస్తున్నారని ఉదాహరణలతో చెప్పాను. ఉదయ్‌ దినకరన్‌ అనే వ్యక్తి ఆగ్రిగోల్డు చైర్మన్‌ బంధువు, ఈయన ప్రతిపాటి పుల్లారావుకు భూములు అమ్మారని తెలిపారు.. హాయ్‌ల్యాండ్‌కు ఉదయ్‌ దినకరన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అయినాగానీ ప్రతిపాటి పుల్లారావు నిసిగ్గుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సీఐడీ విచారణ జరుగుతున్న సమయంలో ఆగ్రిగోల్డు ఆస్తులను తక్కువ ధరకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య పేరిట కొనుగోలు చేశారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే ఆ భూములు వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తే బాగుంటుందన్నారు. అగ్రిగోల్డు బాధితులను ఇవాళ హుటాహుటిన అసెంబ్లీకి పిలిపించుకున్నారని, దీంతో న్యాయం జరుగుతుందని బాధితులు ఎదురు చూస్తే వారి పట్ల చంద్రబాబు ఎలాంటి మానవత్వం చూపలేదు. చనిపోయిన కుటుంబాలకు రూ.3 లక్షలు ఇస్తారని ప్రకటించి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న భీమాలో మాత్రం రూ.5 లక్షలు ఇస్తున్నారు. ఆగ్రిగోల్డు బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే ముష్టివేసినట్లు రూ.3 లక్షలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇవే కాకుండా ఆగ్రిగోల్డుకు సంబంధించి హోటల్‌ను రూ.14 కోట్లకు ఆమ్మెశారు. వీటిని అటాచ్‌మెంట్‌ పరిధిలోకి తీసుకురావాలని నిరుడు సభలోనూ, ఇప్పుడు కూడా చెప్పాం. అగ్రిగోల్డు డైరెక్టర్‌ సీతారామ్‌ భార్య, కూతురు బ్రహ్మంగారి మఠంలో భూములు అమ్ముతున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకొని వేలం వేసి బాధితులకు చెల్లించాలని ఎంత చెప్పినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. హాయ్‌ల్యాండ్‌ ఆస్తులు ఎందుకు వేలంలోకి రావడం లేదని నిలదీశారు. షాపింగ్‌మాల్‌ను ఎందుకు అటాచ్‌చేయడం లేదని ప్రశ్నించారు. 

ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నిర్వాహణ దారుణంగా ఉందని, ప్రతిపక్షం గొంతునొక్కుతున్నారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ స్పీకర్‌ను అడ్డుపెట్టుకొని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అగ్రిగోల్డు భూముల కొనుగోలుపై హౌస్‌ కమిటీ అంటున్నారు. ప్రివిలేజ్‌ కమిటీ మాదిరిగానే ఈ కమిటీ కూడా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డు భూముల కొనుగోలుపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేయాలని తాము డిమాండ్‌ చేస్తే..హఠాత్తుగా మైక్‌ కట్‌ చేసించి, ఎప్పుడో 40 రోజుల క్రిందట ఆడవాళ్లపై అవహేళనగా మాట్లాడిని మాటలను అసెంబ్లీలో ప్రసారం చేయడం దారుణమన్నారు. నిన్న అసెంబ్లీలో ఏ రకంగా చంద్రబాబు ప్రమాణం చేయించారో చూశామన్నారు. హిట్లర్‌కు చంద్రబాబుకు దగ్గర పోలికలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో దొరకడం, హిట్లర్‌ మాదిరిగా నిన్న సభలో ప్రమాణం చేయించి కాల్వ శ్రీనివాసులకు సైగ చేయడం, ఆయన స్పీకర్‌ను ఆదేశించడం వెంటనే సభలో తాను మాట్లాడకుండా వాయిదా వేయించడం చూశామన్నారు. ఇంతదారుణంగా అసెంబ్లీని నడపడం నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగకమానదని వైయస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. 
Back to Top