పచ్చనేతల చెంపచెల్లుమనేలా ఉత్తర్వులు

అధికార పార్టీ నాయకులకు హైకోర్టు మొట్టికాయలు
అధికార, ప్రతిపక్షాలను సమానంగా చూడాలని ఖాకీలకు హితభోద
రాజకీయ దురుద్దేశ్యంతో కేసులు తగదని వ్యాఖ్య

అధికారాన్ని
అడ్డం పెట్టుకొని ప్రతిపక్షంపై దాడులకు తెగబడుతున్న పచ్చనేతలకు గట్టి షాక్
తగిలింది. రాజకీయ ప్రత్యర్థులను వేధించే అధికార పార్టీ నాయకులకు పోలీసులు
కొమ్ముకాయొద్దని హైకోర్టు సూచించింది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులకు
అండగా నిలిచిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై
కేసులు బుక్ చేసిన పోలీసులు, అదే క్రమంలో వారి ఫిర్యాదును
పట్టించుకోకపోవడం తగదని హితబోధ చేసింది. ప్రభుత్వ అవినీతి, అరాచకాలను
ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు పోలీసులు, అధికారులను ఉసిగొల్పి
అక్రమంగా కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే.  
 
రేణిగుంట
 విమానాశ్రయంలో నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో న్యూఢిల్లీకి
వెళ్లాల్సిన 19 మంది ప్రయాణికుల విషయంలో ఆ సంస్థ మేనేజరు రాజశేఖర్ దురుసుగా
వ్యవహరించారని బాధితులు ఎంపీ మిథున్‌రెడ్డి వద్ద వాపోయారు. దీంతో ఆయన
ప్రయాణికులకు అండగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే  ప్రయత్నం
చేశారు. అయితే స్థానిక పోలీసులు మాత్రం ఎంపీ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్
రెడ్డిపై అధికారపార్టీ నాయకుల ప్రోద్భలంతో కేసులు నమోదు చేయడంతో వారు
హైకోర్టును ఆశ్రయించారు.  

అధికారులను పావుగా
ఉపయోగించుకొని ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్న అధికారపార్టీ
నాయకులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. పోలీసులు, అధికారులు ఒక  వర్గం
ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. మరొకరి విన్నపాన్ని పట్టించుకోకపోవడంపై
ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తే.. ఇక
బాధితులకు పోలీసులు ఏం న్యాయం చేసినట్లని హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ
దురుద్దేశంతో వేసే కేసులు, ఫిర్యాదులపై అధికారులు- పోలీసులు విచక్షణతో
 నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.  ఈ కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై
వెంటనే కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తర్వాత సెక్షన్
41(ఏ)కింద వారికి నోటీసులు ఇచ్చి వాటిపై బాధితుల వివరణ పూర్తిగా
తెలుసుకున్నాకే కేసులో ముందుకు సాగాలని ఆదేశించింది. 

తాజా ఫోటోలు

Back to Top