పార్టీ ఫిరాయింపుల‌పై హైకోర్టు సీరియ‌స్‌


- పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల‌కు, స్పీక‌ర్‌కు నోటీసులు
   
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వారిపై  అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఫిరాయిం‍పు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ మంగళగిరి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మంగళవారం వాదనలు వినిపించారు. నలుగురు మంత్రులు సహా మొత్తం 19 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలోనే ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రెడ్డికి ఫిర్యాదు చేసినా.. స్పీకర్‌ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పీకర్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు అవుతున్నా.. స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాది సుధాకర్‌రెడ్డి వాదనలతో విన్న ధర్మాసనం​.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్‌ నిర్దిష్ట సమయంలో స్పందించాల్సి ఉందన్న వాదనతో ఏకీభవించారు.


Back to Top