తుఫాన్ నష్టం నుంచి గట్టెక్కించండి

న్యూఢిల్లీ:
కుండపోత వర్షాలతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు పూర్తిగా తుడుచుకు
పెట్టుకుపోయాయని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్ సభలో
వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు,
వైఎస్ఆర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు.  నెల్లూరు జిల్లాలో 25 వేల
ఎకరాల్లో ఆక్వా దెబ్బతిందని తెలిపారు.  సుమారు రూ. 1500 నుంచి రూ. 1700
కోట్ల మేర రైతులకు నష్టం జరిగిందని చెప్పారు.  అరటి, వరి పంటలు తీవ్రంగా
దెబ్బతిన్నాయన్నారు.

గోదావరి జిల్లాల్లో మూడున్నర
లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్న విషయాన్ని మేకపాటి లోక్ సభ ద్వారా
కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా అనంతపురంలో వేరుశనగ పంట పూర్తిగా
నాశనమైపోయిందన్నారు. ఎక్కువగా నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో
తీవ్ర నష్టం వాటిల్లినట్లు చెప్పారు. రహదారులన్నీ పుర్తిగా ధ్వంసమయ్యాయని
పేర్కొన్నారు. రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని
కోరారు. సదరు జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర
బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Back to Top