ప్రజల నెత్తిన పెనుభారం మోపుతున్న బాబు

  • ఆర్టీసీని ప్రైవేటుపరం చేయదల్చారా బాబు
  • రెండేళ్లలో మూడుసార్లు ధరలు పెంచేస్తారా??
  • సంవత్సరానికి రూ.120 కోట్ల పెనుభారం మోపుతారా?
  • ఆయిల్ ధర పెరిగినా వైయస్సార్ ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదు
  • గుర్తుపెట్టుకోవాలని చెబుతూ బాబే అన్నీ మర్చిపోతున్నారు
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

హైదరాబాద్ః ఆర్టీసీ ధరలు పెంచబోమని అధికారంలోకి రాకముందు పదేపదే చెప్పిన చంద్రబాబు..రెండేళ్ల ఒక మాసం పాలనలో మూడోసారి ఆర్టీసీ ధరలు పెంచుతున్న తీరు దారుణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.  2015లో 12 శాతం, 2016లో 10 శాతం మేర ఛార్జీలను బాదుతూ చంద్రబాబు ప్రజల నడ్డివిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ పై ఒక్క రూపాయి పేరుతో మళ్లీ ధరలను పెంచుతూ చంద్రబాబు ప్రజలపై సంవత్సరానికి రూ. 120 కోట్ల పెనుభారాన్ని మోపుతున్నారని ధ్వజమెత్తారు. దీన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 

అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ క్రూడ్ ఆయిల్ ధర 140 డాలర్లున్న సమయంలోనే దివంగత ముఖ్యమంత్రి మహానేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు. ఇవాళ డీజిల్ ధరలు అంతర్జాతీయంగా 40 డాలర్లకు పడిపోయిన సందర్భంలో ధరలు తగ్గించాల్సింది పోయి పెంచడం దుర్మార్గమని టీడీపీపై విరుచుకుపడ్డారు. డీజిల్ అమ్మకాలపై వ్యాట్ ట్యాక్స్ కాకుండా  లీటర్ కు రూ. 4 అదనంగా వసూలు చేయడం అన్యాయమని తూర్పారబట్టారు.

భవిష్యత్తులో ఆర్టీసీని ప్రైవేటుపరం చేయదల్చారా బాబు...? ఇప్పటికే రాష్ట్రంలో అనేక వ్యవస్థలను ప్రైవేటు పరం చేశారు. ఆ రీతిలోనే ఇది కూడా కొనసాగుతుందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇవాళ ఒక్క రూపాయి అని చెబుతూ ఏడాదికి రూ. 120 కోట్ల భారం వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మీకు చేతగాక ప్రజలను పీక్కుతుంటారా? ఛార్జీలు తగ్గించకుంటే వైదొలగండి? సర్కార్ పై తిరగబడండి అని గతంలో మాట్లాడిన చంద్రబాబుకు ఇప్పుడా విషయాలు గుర్తుకు లేవా అని నిలదీశారు.  

కాకినాడ పాదయాత్ర సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పారు. కానీ ఇవాళ మీరు చేస్తున్నదేంటని వేణుగోపాలకృష్ణ బాబును ప్రశ్నించారు. ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. వారి వద్ద నుంచి ఒక్కో రూపాయి ఖజానాకు జమ చేసి పారిశ్రామికవేత్తలకు రాయితీల కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. పట్టిసీమ కోసమని చెప్పి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.  వేలకోట్ల విలువ చేసే దేవాలయ భూముల్ని బాబు తన ఖాతాకు జమచేసుకున్నారని నిప్పులు చెరిగారు. ప్రతీ పత్రికా సమావేశాల్లో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలంటూ మాట్లాడే చంద్రబాబే అన్నీ మర్చిపోతున్నారని వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రజలు ఏదీ మర్చిపోరన్న విషయం తెలుసుకోవాలన్నారు.
Back to Top