కొడుకును ప్రజాక్షేత్రంలోకి పంపే దమ్ముందా బాబూ

-దొడ్డిదారిన లోకేష్ ను మంత్రిని చేయాలనుకోవడం సిగ్గుచేటు
-బాబుది అంతా ప్రచార ఆర్భాటమే
-నిరుద్యోగ భృతి డబ్బులను లోకేష్ కు దోచిపెట్టారు
-ప్రతి ఇంటికీ బాబు రూ. 58 వేల బకాయి పడ్డారు
-హోదాను అడ్డుకున్నారు..నిరుద్యోగభృతి ఇవ్వకుండా మోసగించారు
-వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్ః ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఇంటికీ రూ. 58 వేలు బకాయిలు పడ్డారని, తక్షణం నిరుద్యోగుల కుటుంబాలకు ఆ బకాయిలు చెల్లించాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఆర్భాటంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఊదరగొట్టి ఓట్లు దండుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను పట్టించుకోవడం మానేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు గుర్తుంచుకుంటే ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో మ్యానిఫెస్టోలను కూడా టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేశారని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేద్దామని ముందుస్తుగానే నిర్ణయానికొచ్చిన టీడీపీ యూట్యూట్‌లో కూడా వారి ఎన్నికల ప్రణాళికలకు సంబంధించిన వీడియోలను కూడా తొలగించారని ఆరోపించారు. 

కొత్తగా గృహప్రవేశం చేసినప్పుడు, పూజలు పురస్కారాలు చేసినప్పుడు ఎంతటి నీచుడైనా ముందుగా ఓ మంచి కార్యం తలపెడతారని.. కానీ అచ్చెన్నాయుడు మాత్రం కార్యాలయాన్ని ప్రారంభిస్తూనే నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని చెబుతూ నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నెలకు రూ. 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారని... గత 29 నెలలుగా మిగిల్చిన లక్షా 15 వేల కోట్ల రూపాయలను తక్షణం నిరుద్యోగుల కుటుంబాలకు ఇంటికి రూ.58 వేల చొప్పున పంచి పెట్టాలన్నారు. జీడీపీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండంకెలతో దూసుకెళ్తుందని ప్రచారం చేస్తున్న చంద్రబాబు నిరుద్యోగులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. 

దమ్ముంటే.. నీ కొడుకుని ప్రజాక్షేత్రంలోకి పంపు
రాష్ట్రం మొత్తం మీద ఉన్న నిరుద్యోగులకు దక్కాల్సిన భృతిని  మూటలు కట్టి బాబు తన కొడుకు లోకేశ్‌కి దోచిపెడుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. దొడ్డి దారిన కుమారుడిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇద్దామని అనుకుంటున్నారని, దమ్ముంటే కొడుకుని ప్రజాక్షేత్రంలోకి పంపి ఆయనేంటో నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. లోకేశ్‌ సమర్ధతపై నమ్మకం లేకనే చంద్రబాబు అడ్డదారిన మంత్రిని చేయాలని కోరుకుంటున్నారని, సిగ్గుచేటని విమర్శించారు. 

ప్రత్యేకహోదా వచ్చి ఉంటే నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాధపడాల్సిన అవసరం ఉండేది కాదని పద్మ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా రాకుండా  అడ్డుకున్నారు.. నిరుద్యోగులను ఆదుకోనూ లేదు.. మరి రెండేళ్లకు పైగా అధికారంలో ఉండి బాబు ఏం వెలగబెట్టారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా ఇంజినీరింగ్, డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులను చూసి కూడా చంద్రబాబు మనసు కరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు వైయస్‌ఆర్‌ అందరూ చదువుకోవాలన్న ఉద్దేశ్యంతో ఫీజు రీఎంబర్స్‌బమెంట్‌.. అందరూ బాగుండాలన్న తపనతో 50 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించారని పేర్కొన్నారు. ఆయన కూడా నీలాగా కొడుక్కి దోచిపెట్టాలని ఆలోచించి ఉంటే రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందేదా అని ప్రశ్నించారు.  వైయస్‌ జగన్‌ నిర్వహించిన ‘యువభేరి’ల పట్ల యువత స్పందిస్తున్న తీరు చూస్తుంటేనే చంద్రబాబు పరిపాలనపై యువత ఎంతగా అసహనంతో ఉన్నారో తెలుస్తుందన్నారు. ఇప్పటికీ ఆ విషయం బాబు దృష్టికి రాకపోవడం బాధాకరమన్నారు. 

మీ మంత్రులతో పథకాలను చెప్పించగలరా
చంద్రబాబు పథకాలన్నీ ప్రచార ఆర్భాటాలని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను మీ మంత్రులతో చెప్పించగలవా అని సవాల్‌ చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎంతోకాలం మోసం చేయలేరన్నారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఏదైమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం తుదికంటా పోరాడతామని, ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె చంద్రబాబును హెచ్చరించారు. 
Back to Top