పోలీసులు అరెస్ట్ లకు తెగబడడం దుర్మార్గం

అచ్యుతాపురం: పోలీసులు రాజ్యమేలుతున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ అరెస్ట్‌లకు తెగబడడం దుర్మార్గమని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏపిఐఐసి ఆధ్వర్యంలో పైపులైన్‌ని నిర్మిస్తున్నారు. పైపులైన్‌ నిర్మాణంలో మత్స్యకారులకు ఐదు లక్షల ప్యాకేజీ, ఉద్యోగాల కోసం ఉద్యమించడానికి ప్రజాసంఘాలు, వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొనడానికి అమర్‌నాథ్ హాజరవుతుంటే మార్గం మధ్యలో ఉప్పుగల్లీలవద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌చేసి యలమంచిలి పోలీసుస్టేషన్‌కి తరలించారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసారు. మత్స్యకారుల అనుమతితో పైపులైన్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. పోలీసులను కాపలాపెట్టి నెలరోజులపాటు 144 సెక్షన్‌ విధించి గ్రామాన్ని నిర్భందించడం న్యాయం కాదన్నారు. వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించే హక్కు పోలీసులకు ఎక్కడుందని ఆయన సిఐ విజయనాథ్‌ని నిలదీసారు. యలమంచిలి సిఐ కార్యాలయంలో నిరసన వ్యక్తంచేసారు. అరెస్ట్‌ అయిన వారిలో యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ ఉన్నారు.

Back to Top