కమీషన్ల కోసమే జీఎస్‌డీపీ పెంపు ప్రతిపాదన

– ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ కమిటీని కోరడంపై అంబటి  ఆక్షేపణ
– అప్పులు తీసుకొచ్చి ప్రజలపై భారం మోపే యోచనలో సర్కారు
– జీఎస్‌డీపీ పెంచి చూపడంపై కుట్ర బయటపడిందన్న రాంబాబు

 హైదరాబాద్ః ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ (ఫిజికల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) చట్టంలో జీఎస్‌డీపీపై ఉన్న పరిమితిని 3 నుంచి 4 శాతానికి పెంచమని ఏపీ ప్రభుత్వం కోరడంపై వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకొచ్చి కమీషన్లు కొట్టేసేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు లెక్కలు చూపించి జీఎస్‌డీపీ పెంచడం వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని స్పష్టం చేశారు. అప్పులు తీసుకొచ్చి ఆయన కమీషన్లు కొట్టేస్తే రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్యాకేజీ ఒప్పుకోకపోయుంటే పోలవరం కల సాకారం అయ్యేది కాదని చెప్పడంపై అంబటి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 

జీడీపీ లెక్కలను ఆర్బీఐ తిరస్కరించింది
ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ కమిటీకి జీఎస్‌డీపీని 3 నుంచి 4 శాతానికి పెంచాలని కోరడం వెనుక అసలు కారణం కమీషన్లు రాబట్టుకోవడానికే తప్ప మరెందుకు కాదని అంబటి అభిప్రాయపడ్డారు. అందుకోసమే తప్పుడు లెక్కలతో 12.23 శాతం జీఎస్‌డీపీ చూపించారని అయితే ఆదాయం మాత్రం పది శాతం కూడా పెరగకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ లెక్కలపై ఆర్బీఐ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. 7.2 శాతం జీఎస్‌డీపీ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆదాయం 20 శాతం పెరిగితే రాష్ట్రానికి కనీసం 40 శాతం పెరగాలి కదా అని ప్రశ్నించారు. దేశ జీఎస్‌డీపీ 7.2 శాతంగా చూపిస్తేనే అంతర్జాతీయ సంస్థలు అభ్యంతరాలు చెబుతున్న విషయాన్ని గుర్తించి చంద్రబాబు నడుచుకోవాలని సూచించారు. వాస్తవ పరిస్థితులు చూస్తే కరువు కాటకాలతో రైతులు అల్లాడుతున్నారు.. ఈయన మాత్రం జీఎస్‌డీపీ పెరిగింది.. ఆదాయం సంగతి మాత్రం తెలియదన్నట్టు మాట్లాడ్డం హాస్యాస్పదమన్నారు. ప్యాకేజీకి ఓప్పుకోకపోయుంటే పోలవరం ప్రాజెక్టు దక్కేది కాదని చంద్రబాబు చెప్పడం దౌర్భాగ్యమన్నారు. పోలవరం అనేది విభజన చట్టంలో మన హక్కుగా భావించి సాధించుకోవాలని చెప్పారు. జాతీయ ప్రాజెక్టును కమీషన్ల కోసం తెచ్చుకున్న చంద్రబాబు ప్రత్యేక హోదాతోపాటు, ప్రత్యేక ప్యాకేజీని తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. న్యాయబద్దంగా మనకు దక్కాల్సిన నిధులను కూడా సాధించలేక బిక్షంగా పడేసినవాటికి కూడా పండగ చేసుకుంటున్నారని టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 

మెయిన్‌ హెడ్డింగ్‌ కోసం బాబు తాపత్రయం
నోబుల్‌ బహుమతి సాధించిన తెలుగు వారికి వంద కోట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మెయిన్‌ పేజీ హెడ్డింగ్‌ కోసం బాబు తాపత్రయ పడతారని చెప్పడానికి ఇది నిదర్శనమన్నారు. శాస్త్రవేత్తలెవరూ నీవిచ్చే వంద కోట్ల కోసం ప్రయోగాలు చేయడం లేదని దేశం కోసం కష్టపడుతున్నారని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడికి మతి భ్రమించిందని అంబటి ఎద్దేవా చేశారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవకాశాలు, వసతులు కల్పించాలి తప్ప అవార్డులు వచ్చిన తర్వాత ఇవ్వడం గొప్ప కాదని తెలిపారు. రాష్ట్రంలోని 50 వేల పాఠశాలల్లో రోజూ గంటపాటు పాఠాలు బోధించాలన్న నిర్ణయాన్ని మానుకోవాలని సూచించారు. ఎంతో బంగారు భవిష్యత్తున్న చిట్టి బు్రరలను నీ చాదస్తంతో పిచ్చోల్లను చేయొద్దని హితవు పలికారు. ఉన్నత చదువులు చదువుకున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లే నీ మీటింగ్‌లకు మతులు పోగొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంచి పనులు ఎలాగూ చేయలేమని అర్థమైందో ఏమో చంద్రబాబుకు.. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తకు మతిభ్రమించిందని వ్యంగ్యంగా మాట్లాడారు. మగాళ్లు తిరిగి ఆడాళ్లకు ఎదురు కట్నం ఇచ్చి చేసుకునే రోజులు వస్తాయని చెప్పడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. అందరూ సమానమనే రోజులే వస్తాయని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇన్నాళ్లు నోటికొచ్చినట్టు చేసిన వ్యాఖ్యలను బేషరతుగా చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. 

Back to Top