ఘ‌నంగా మ‌హానేత జ‌యంతిని నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌

హైదరాబాద్ : దివంగత మహానేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఈ నెల 8న  ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.  లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో మహానేత వైఎస్సార్ జయంతి సభలు నిర్వహించాలని చెప్పారు. వైఎస్సార్ విగ్రహాలను పూలతో అలంకరించి, ఘనమైన నివాళులర్పించాలన్నారు. విగ్రహాలు లేని డివిజన్ల కార్యకర్తలు దివంగత సీఎం వైఎస్సార్ ఫొటోలు ఉంచి, పూలమాల వేసి నివాళ్లు అర్పించాలని చెప్పారు. వీలున్న చోట్ల సేవా కార్యక్రమాలు కూడా చేపట్టాలని కోరారు. వైద్యశాలల్లో పేద రోగులకు పండ్లు పంపిణీ, పేద విద్యార్థులు, అంధ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ, పేద మహిళలకు చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు సందర్భోచితంగా చేపట్టాలని చెప్పారు.
 
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ పరిశీలకుడు నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు నగరంలో వైఎస్సార్ సీపీ లేదని ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. వారికి గుణపాఠం చెప్పే రీతిలో 150 డివిజన్లకు కాను 75 డివిజన్లకు తగ్గకుండా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వైఎస్సార్ జయంతిని చూసి ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని చెప్పారు. పార్టీ నిర్మాణ పరంగా బలమైన అడుగులు వేసేందుకు ఈ జయంతి కార్యక్రమం ఒక మెట్టుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉపయోగించుకోవాలని సూచించారు.
 
జయంతి కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ 70 కేజీల కేక్‌ను కట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు బి. శ్రీనివాస రెడ్డి, గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు ఎం. శ్యామల, పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, కార్యాలయ ఇన్‌చార్జ్ బి. మోహన్ కుమార్, జె. మహేందర్ రెడ్డి, మతీన్, డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
Back to Top