మహిళలకు టీడీపీ చేసింది శూన్యం

రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు
బెల్టు షాపులు రద్దు చేస్తామని సంతకం చేసి..
గ్రామగ్రామాన షాపులను మరిన్ని విస్తరిస్తున్నారు
బడ్జెట్ లో ప్రతిసారి మహిళలకు మొండిచేయి చూపిస్తున్నారు
మహిళలకు అదీ చేస్తాం ఇదీ చేస్తామని చెప్పడం కాదు..
వారి సమస్యలను పరిష్కరించి చూపాలిః చరితారెడ్డి

హైదరాబాద్ః ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్ లో మహిళలకు మొండిచేయి చూపుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. కనీసం ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశించిన మహిళలకు నిరాశే మిగిలిందన్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రామహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో...మహిళలు రుణాలు కట్టలేదన్నారు. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీలు, అపరాధ వడ్డీలు కూడా పెరిగిపోయి బ్యాంకుల నుంచి మహిళలకు  వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు.  

రుణాలు మాఫీ కాక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 84 లక్షల మంది మహిళలు రుణాలు మాఫీ ఐతాయని భావించారని, రెండేళ్లయినా ఇంతవరకు ప్రభుత్వం మాఫీ చేసిన పాపాన పోలేదన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పి హామీని మాత్రమే మాఫీ చేశారని ఎధ్దేవా చేశారు. మొదట లక్ష మాఫీ అని కుదించారు. ఆతర్వాత సంఘానికి లక్ష అన్నారు. ఒక్కో సభ్యురాలికి రూ. 3 వేలు మాత్రమే ఇస్తున్నారు. మహిళాసంఘాలను అధికారులు రోడ్డుకు ఈడుస్తున్నారని చరితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలా గ్రూపులను మేమే సృష్టించాం, ఉద్ధరించామని చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం చేసిన సహాయం ఏమీ లేదన్నారు. 

84 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో రుణాలూ తీసుకున్నారని,  2014-15లో  32 లక్షల మంది శ్రీ నిధి ద్వారా రుణాలు తీసుకుంటే. 2015-16 లో 46 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. 38 లక్షల మంది రుణాలు తీసుకోలేదని ప్రభుత్వమే లెక్కల్లో చూపించిందని చరితారెడ్డి పేర్కొన్నారు. మిగిలిన వాళ్లు రుణాలు కట్టుకోలేక డీ గ్రేడ్ లుగా మిగిలిపోయారన్నారు. సెర్ఫ్ రేటింగ్ ప్రకారం ఏ గ్రేడ్ 12 శాతం మంది ఉంటే. డీ గ్రేడ్ 52.3 శాతం మంది ఉన్నారు.2015-16కు సంబంధించి ఎస్ఎస్ సీ గ్రూపులకు... మూలధననిధి నుండి 10 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం మూడు వేల రూపాయలే ఇచ్చారని దుయ్యబట్టారు. 

రూ. 3వేల ప్రకారం 84 లక్షల మంది పొదుపు మహిళలకు 2,500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా..బడ్జెట్ లో కేవలం వేయి కోట్లతో సరిపెట్టి, రూ. 1500 కోట్లు ఎగనామం పెట్టారని చరితారెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పొదుపు లక్ష్మి సంఘాలకు శ్రీనిధి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పి, ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని చరితారెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.  అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ఐదు సంతకాల్లో ఓ సంతకం చేసిన విషయాన్ని చరితారెడ్డి గుర్తు చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా గ్రామగ్రామాన బెల్ట్ షాపులను విస్తరించారని చరితారెడ్డి ఫైరయ్యారు. 

అమలులో ఉన్న పండంటి పథకం, మా ఇంటికి మహాలక్ష్మీ పథకాలు ఎక్కడా కూడా అమలు కావడం లేదన్నారు. పెళ్లీడు అమ్మాయిలకు రెండు లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. అంగన్ వాడీలను ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకుంటుందని చరితారెడ్డి ఫైరయ్యారు.  మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్,  ఎస్పీ, ఐజీ స్థాయి అధికారులను నియమిస్తామన్న హామీలను ప్రభుత్వం అటకెక్కించిందని తూర్పారబట్టారు. ఇటీవలే విజయవాడలో కొందరు కీచకులు మహిళల అవసరాలను ఆసరా చేసుకొని ఏవిధంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ కు పాల్పడ్డారో అందరూ చూశారన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు పావులా వడ్డీకే రుణాలు అందించి ఆదుకున్నారన్నారు.  అలా మహిళలు సకాలంలో రుణాలు చెల్లించడం వల్ల బ్యాంకులు అపార నమ్మకంతో ఎక్కువ రుణాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోసగిస్తుందన్నారు. మహిళలకు అదీచేస్తాం, ఇదీచేస్తామని చెప్పడం కాదని..వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజేశారు. 

Back to Top