లీకేజీలపై ప్రభుత్వం భయపడుతోంది

విజయవాడ: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలపై సమగ్ర చర్చ జరగాలని అసెంబ్లీ ప్రతిపక్షం పట్టుబడితే అధికార పార్టీ ఎందుకు భయపడుతుందో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లీకేజీలపై వాయిదా తీర్మాణం ఇస్తే విద్యాశాఖామంత్రి సభకు రాకుండా తప్పించుకున్నారని, మరో మంత్రి నారాయణ విషయం రాగానే సభ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇద్దరు వియ్యంకులు గంటా, నారాయణలు కలిసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ విద్యా వ్యవస్థనే భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియా రాజకీయాలు చేస్తున్న వ్యక్తులను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థకే సూత్రాలు నేర్పించే చంద్రబాబు ఐపీఎస్‌ అధికారి దాడి విషయంలో ఎందుకు వాటికి భిన్నంగా వ్యవహరించారని నిలదీశారు. ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బోండా ఉమలకే ఈ క్షమాపణలు పరిమితమవుతాయా లేక మిగిలిన రెండు సంవత్సరాల పాలనలో ఏ అధికారిపైనైనా దాడులు చేసి విజయవాడకు వచ్చి సారీ అంటే సరిపోతుందా అనేది చంద్రబాబు నాయుడు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ మంత్రి నారాయణ ఎన్నికల పెట్టుబడుల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. లీకేజీలపై సమాధానం చెప్పకుండా సభా సమయాన్ని వృధా చేస్తున్నారంటూ ప్రతిపక్షంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.

Back to Top