గవర్నర్‌, ముఖ్యమంత్రిలను వెంటనే బర్తరఫ్ చేయాలి

అనంతపురం: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్‌ చంద్రబాబుకు బ్రోకర్‌గా తయారయ్యాడని, ఆ ఇద్దరు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించి అనైతిక చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. అనంతపురం నియోజకవర్గ కేంద్రంలో సేవ్‌ డెమోక్రసీ ధర్నా చేపట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రతిపక్ష పార్టీ నిరసనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబుది మొదటి నుంచి వెన్నుపోటు వైఖరేనని దుయ్యబట్టారు. తనకైతే ఒక రూల్‌ వేరొకరికైతే మరో రూల్‌ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్యామ్యాన్ని ఖూనీ చేస్తున్న గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబులను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ పదవుల్లో ఉండటానికి కూడా వారికి అర్హత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అనైతిక విధానాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైయస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. చంద్రబాబు చేతిలో అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వైయస్‌ జగన్‌ రాష్ట్రపతిని కలిసి విన్నవించడం జరిగిందని చెప్పారు.

Back to Top