ప్రజల నోట్లో మట్టి కొట్టారు

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసగించాయి
చంద్రబాబు చేతగానితనం వల్లే..
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం
ఐదు కోట్ల ఆంధ్రులను బికారులు చేశారు
టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తిన పార్థసారథి

హైదరాబాద్ః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టికొట్టాయని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు చేతగానితనం, నిస్సాహాత కారణంగానే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని పార్థసారథి నిప్పులు చెరిగారు. ఇరు ప్రభుత్వాలు 5 కోట్ల ఆంధ్రులను బికారులను చేశారని ధ్వజమెత్తారు.  కేంద్ర బడ్జెట్ ను చూసి ఏపీ ప్రజలు టీడీపీ, బీజేపీలపై ఆగ్రహాలకు గురవుతున్నారని పార్థసారథి తెలిపారు. తెలుగు ప్రజలకు జరిగిన అవమానంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. 

చంద్రబాబు అనుభవజ్ఞుడని ఆయనపై నమ్మకంతో ప్రజలు పట్టం కడితే...కన్నీళ్లతో రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారని పార్థసారథి ఫైరయ్యారు.   ప్రజలకు కావాల్సింది బాబు కన్నీళ్లు కాదని.. ప్రజా రాజధాని, సాగు-తాగునీరన్న విషయం గుర్తెరగాలన్నారు. చంద్రబాబు, మోడీలు కలిస్తే అభివృద్ధే అభివృద్ధి అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన మీరు...ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడులు ఎక్కడ మీటింగ్ లు పెట్టినా ఒకరినొకరు పొగుడుకోవడమే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేసిన పాపాన పోవడం లేదన్నారు. 

అడుక్కున్నట్లుగా పోలవరానికి రూ. 100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ.100 కోట్లు పడేశారని... ప్రపంచస్థాయి రాజధానికి ఒక్క పైసా ఇవ్వలేదని పార్థసారథి టీడీపీ, బీజేపీలపై ఆగ్రహం వెలిబుచ్చారు. మీరు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు..? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా లేక అథోగతి పాలు చేయాలనుకుంటున్నారా అని పార్థసారథి మండిపడ్డారు. శంకుస్థాపనలతోనే రాష్ట్ర ప్రజలను తృప్తి పర్చాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తుంటే....హోదా అవసరం లేదు, అంతకంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ప్యాకేజీలయితే ఇవ్వలేదు గానీ, చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనే ప్యాకేజీలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాయని పార్థసారథి దుయ్యబట్టారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే...రాజధాని శంకుస్థాపనకు మోడీ వచ్చిన రోజే నిరసన తెలిపి ఉంటే ఇవాళ రాష్ట్రానికి ఈదుస్థితి వచ్చేది కాదన్నారు. ఏపీ ప్రజల నోట్లో  గుప్పెడు మట్టి, చెంబెడు నీళ్లు కొట్టి పోయారు తప్ప ఏమీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూ కూడా చంద్రబాబు కనీసం మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే 23 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు .. ప్రజాధనం వృథా చేయడం తప్ప రాష్ట్రానికి సాధించేదేమీ లేదన్నారు.  చంద్రబాబు, మంత్రులు కేసుల మాఫీ కోసమే ఢిల్లీ వెళ్తున్నారని పార్థసారథి ఎత్తిపొడిచారు.  పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం సహా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  చంద్రబాబు ఎంతసేపు అవినీతి సొమ్ముతో జేబులు నింపుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్పితే..ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే చేయడం లేదని  పార్థసారథి మండిపడ్డారు. 

చంద్రబాబు ప్రభుత్వం అడుక్కునే ప్రభుత్వమైపోయిందని పార్థసారథి ఎద్దేవా చేశారు. కేంద్రంలో చంద్రబాబు తన వాటా గురించి ఆలోచిస్తున్నారు తప్ప ...కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర వాటా గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారని తూర్పారబట్టారు. 2018లోగా పోలవరం పూర్తిచేస్తామన్న ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని విరుచుకుపడ్డారు.  ఇంకా కూడా మంత్రి సుజనాచౌదరి స్పెషల్ స్టేటస్ పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకనైనా చంద్రబాబు తన వైఫల్యం నుంచి గుణపాఠం నేర్చుకొని కేంద్రం వద్ద నోరు తెరవాలన్నారు. 

తాజా వీడియోలు

Back to Top