సిగ్గు ఉండాలి ఈ ప్రభుత్వానికి ..!

గుంటూరు: చీకట్లో కుట్రలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు లేదని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అభివర్ణించారు. మెడికల్ రిపోర్టులు ట్యాంపర్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండి పడ్డారు. మెడికల్ రిపోర్ట్ లను ప్రభుత్వం తారుమారు చేయటాన్ని ఆయన బహిరంగంగా రుజువు చేశారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న దీక్ష స్థలి నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఒక మనిషి ప్రాణాలతో ఈ విధంగా చెలగాటం ఆడటం ఎంత వరకు అవసరం అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తో ఎవరికి అవసరం ఉంటుంది అని ఆయన అన్నారు. వైఎస్ జగన్ కు అవసరం లేదని స్పష్టం చేశారు. చదువుకొనే విద్యార్థులు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది అవసరం అని ఆయన వివరించారు. ప్రత్యేక హోదా వస్తే లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడులు వస్తాయి.. భారీగా పరిశ్రమలు తరలి వస్తాయి.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. అందుచేత దీని కోసం తాపత్రయ పడుతున్నామని జగన్ వివరించారు.

ఒక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఏ స్థాయిలో తాపత్రయ పడుతున్నారో దీని వల్ల అర్థం అవుతుందని జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గు లేదని తేల్చి చెప్పారు. ఇంతటి దిగజారుడు రాజకీయాన్ని ఎక్కడా చూడలేదని వివరించారు.

 గ్రామాల్లో డాక్టర్లను తాను చూశానని, తన తండ్రి డాక్టర్ గా పనిచేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. పులివెందులలో తన మామ  ఉత్తమ డాక్టర్ గా పేరు గడించారని వివరించారు. అటువంటి డాక్టర్ల కుటుంబం నుంచి తాను వచ్చానని ఆయన అన్నారు. అసలు డాక్టర్ల వ్యవస్థను ఇలా వాడుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. అసలు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయింది అన్నది అర్థం అవుతోందని ఆయన అన్నారు.

ఇక్కడ శాంపిల్స్ తీసి, గుంటూరు ఆసుపత్రి కి తీసుకొనివెళ్లి అక్కడ ట్యాంపర్ చేస్తారని వివరించారు. ట్యాంపర్ చేసి, కీటోన్స్ విలువల్ని మార్చి చూపుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ బీపీ వివరాలు చెప్పమంటే చెప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పద్దతి ప్రకారం పని చేయటం లేదని, బులిటిన్ విడుదల చేయమంటే చేయటం లేదని పేర్కొన్నారు. తప్పుడు వివరాలు.. తప్పుడు అబద్దాలతో పనిచేస్తున్నారని వివరించారు.
ఇప్పుడు అందరి సమక్షంలో బండారం బట్ట బయలు చేసినట్లు జగన్ వివరించారు. కొత్త గ్లూకో మీటర్ తో చెక్ చేస్తే బ్లడ్ సుగర్ 77 పాయింట్లు చూపించిందని, ప్రభుత్వ డాక్టర్లు తెచ్చిన దొంగ మీటర్ తో 88 పాయింట్లు చూపించిందని.. మోసం వెలుగు చూసిందని వివరించారు. ఇప్పటికైనా డాక్టర్ల లో పరివర్తన రావాలని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆసుపత్రులుమారాలని, సూపరింటెండెంట్ మారాలని ఆయన అన్నారు. మంత్రుల మాట వినటం కాకుండా దేవుడి మాట వినాలని ఆయన బోధించారు. 
Back to Top