ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదు: చింతల

చిత్తూరు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అర్హులకు చేరడం లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సుదం మండలంలో మూడురోజుల పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పథకాలను అర్హులకు అందజేసేలా కృషి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, రీయింబర్స్‌మెంట్, పింఛన్లు తదితర పథకాలు పకడ్బందీగా అమలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లను వెయ్యిరూపాయలకు పెంచిన బాబు నిజమైన అర్హుల్లో సగం మందికి కోత విధించారని విమర్శించారు. ఇప్పటికీ పింఛన్ల కోసం నిత్యం తమను చాలామంది సంప్రదిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము తొలిప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడటానికి వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.
Back to Top