రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత

క‌ర్నూలు: ఒక్క పంటకు కూడా సక్రమంగా నీరందక పంటలు ఎండిపోయి అల్లాడుతున్న రాయలసీమ రైతుల కష్టాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టడం లేదని, రైతుల ఆత్మ‌హ‌త్మ‌ల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అని  నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య అన్నారు.. సోమవారం మండల పరిధిలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కాలువకు పంపింగ్‌ చేసే నీటిని దిగువకు విడుదల చేయకుండా గేట్లు మూయించడంపై ఆగ్రహాం చెందారు. జనవరి 2వ తేదిన రెండు పంప్‌లతో కూడిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకంను ప్రారంభోత్సవం చేసి ఇక నుంచి 360 రోజులు నీరిస్తామని మూడు పంటలు పండిచుకుని రాయలసీమ రైతులు ఫ్యాక్షన్‌ గొడవలు లేకుండా జలకాలాటలు ఆడుకోండని చెప్పిన మాటలు నీటిమూటలనే అంటూ ప్రశ్నించారు. దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి హాయాంలో 16 పంప్‌లతో డిజైన్‌ చేయబడిన ఈ ప్రాజెక్ట్‌ను కేవలం రెండు పంప్‌లకు మాత్రమే పరిమితం చేసి ప్రారంభోత్సవం చేయడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. కేసీ కాలువకు ఇంకా రెండు పంప్‌లు, హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకు 12 పంప్‌ల పనులు కూడా పూర్తి చేయిస్తారో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయంలో 790 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు కూడా నీటిని వాడుకోవడానికి ఈ ప్రాజెక్ట్‌ రూపొందించబడినప్పటికి 812 అడుగులలో ఉన్న నీటిని కూడా వాడుకోలేని దుస్థితి నెలకొనడం విచారకరమన్నారు. నది లో లెవెల్‌ వరకు అనగా సిద్ధేశ్వరం వరకు 6.147 కిలోమీటర్‌ వరకు త్రవ్వించే అప్రోచ్‌ చానెల్‌ పనులను టెండర్‌లు లేకుండా నామినేషన్‌ పద్దతిన రూ. 6 కోట్లు సుధాకర్‌రావు కంపెనీకి కట్టబెట్టడంలోని మతలబు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు 5 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిన ఈ కాలువ పనులను ఇంకా 1.147 కిలోమీటర్‌ పనులు మిగిలిపోయాయని గుర్తుచేశారు. శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులను మెయింటనెన్స్‌ చేయకుండా 836 అడుగులకు డ్యాం మట్టం చేరినా దిగువన ఉండే నాగార్జున సాగర్‌కు కృష్ణా జలాలను తరలించి రాయలసీమ ప్రజలకు ద్రోహాం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీ కాలువ కింద సాగు చేసిన 40 వేల ఎకరాల పంటలు నీరు లేక ఎండిపోతుంటే విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో దిగువకు నీటిని తరలించడం కక్ష్య పూరితమేనని దుయ్యబట్టారు. ఏపీలో సర్‌ప్రస్‌( మిగులు) విద్యుత్‌ ఉన్నా అధికారం ఉందని కోస్తా ప్రాంత రైతులకు ప్రయోజనం కలిగేలా.. రాయలసీమ రైతులకు కలిగే నష్టాన్ని పెడచెవిన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల ప్రజలను సమ దృష్టితో చూడాల్సిన ముఖ్యమంత్రి ఒంటికన్ను రాక్షసుడిలా వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు. 2008లో కోనుగోలు చేసిన మోటర్లు, పంప్‌లు ఎక్కడా ఉంచారో చూపించాలని లేక ఏ ప్రాజెక్ట్‌కైనా అమర్చారో రైతులకు అనుమానాలను ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీ ఆయకట్టు రైతులు పంటలు ఎండిపోయి అల్లాడుతున్నా పట్టించుకోకుండా రెగ్యూలేటర్‌ గేట్లు బిగించి కర్నూలు పట్టణ ప్రజలకు తాగునీరు నెపంతో ఎగువకు తరలిస్తారా అంటూ నీటిపారుదల శాఖ ఏఈ శ్రీనివాసులునాయక్‌పై మండిపడ్డారు. వెంటనే తమ ప్రాంత రైతులకు సాగునీటిని దిగువకు విడుదల చేయాలని 120 కిలో మీటర్‌ వరకు ఉండే 40 వేల ఎకరాలలో సాగు చేసిన రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని విరుచుకుపడ్డారు. అనంతరం రైతులు రెగ్యూలేటర్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసుకోవడంతో కథ సుఖాంతమైంది. కార్యక్రమంలో పగిడ్యాల, ముచ్చుమర్రి, నెహ్రూనగర్, పాలమర్రి, ఆంజనేయనగర్, బీరవోలు, ప్రాతకోట, సంకిరేణిపల్లె తదితర గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top