హైదరాబాద్ః రాష్ట్రంలో ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుండడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
విశ్వేశ్వర్ రెడ్డి( ఉరవకొండ ఎమ్మెల్యే)అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య దారుణంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన జడ్పీచైర్మనే స్వయంగా నిధుల విడుదలకు సంబంధించి అసెంబ్లీలో ఒత్తిడి తీసుకురావాలని లెటర్ రాశారని విశ్వేశ్వర్ రెడ్డి సభలో చెప్పారు. జిల్లాల పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్వహణ, ఇతర వాటికోసం 2014-15కు సంబంధించి రూ. 75కోట్ల బకాయిలున్నాయని... 2015 - 16 సంవత్సరానికి గానూ రూ. 79.41 కోట్లున్నాయని, మొత్తం తాగునీటి ప్రాజెక్టులకు రూ. 155 కోట్ల బకాయిలున్నాయని వివరించారు. ఇందులో కేవలం రూ. 10 కోట్ల విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు.
పైప్‌లైన్ నిర్వహిస్తున్న వారికి కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని దుస్థితి నెలకొందన్నారు. కరువు మండలాలకు సంబంధించి ప్రకటన ఎందుకు ఆలస్యంగా వచ్చిందని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు..కేంద్రం నుంచి రూ. 1,500 నుంచి రూ. 2,000 కోట్లు వస్తే, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ. 450 కోట్లు మాత్రమే రావడం దురదృష్టకరమన్నారు. అనంతపురం జిల్లాకు ఈ సంవత్సరం ఇన్‌ఫుట్ సబ్సిడీ ఒక్క రూపాయి అయినా ఇచ్చే అవకాశం ఉందా? లేదా? , ఎన్యూమరేషన్ ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గడికోట శ్రీకాంత్ రెడ్డి( రాయచోటి)గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. నేషనల్ హైవే, సీసీ రోడ్డు, కరువు ఇలా ఏ పనులు జరిగినా వాటికి కేంద్రప్రభుత్వ నిధులనే ఉపయోగిస్తున్నారే తప్ప రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని ఆరోపించారు. ఎక్కడో చెన్నైలో వరద కారణంగా చిత్తూరు జిల్లాలో వర్షాలు పడితే ...దానికి కూడా చంద్రబాబు నీరు-చెట్టు కింద అభివృద్ధి వల్లే నీరు ఉప్పొంగుతున్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రూ. 1010కోట్లు ఇన్‌సబ్సిడీ రావాల్సి ఉంటే అందులో రూ. 430 కోట్లు కేంద్రం విడుదల చేసిందని, మిగిలిన సబ్సిడీని రాష్ట్రం ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఒకప్పుడు 50 శాతం పంట పండినా దానిని కరువుగా నిర్ణయించడం జరిగిందని, ప్రస్తుతం 30శాతం మాత్రమే పంటలు పండితే కరువు పంట కింద నమోదు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కరువుపై కేంద్రం విడుదల చేస్తున్న నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టుకే వినియోగిస్తుందని మండిపడ్డారు.
ఐజయ్య(నంది కొట్కూరు)కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంంలో సుమారు 120 గ్రామాలున్నాయని, ఆ గ్రామాల్లో ఎక్కువగా దళితులే ఉన్నందున వారు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్స్‌ను కోరుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య సభలో ప్రస్తావించారు. ఇప్పటికే స్వయంగా ఎన్నో ఆర్జీలను మంత్రికి, కలెక్టర్‌కు అందజేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ఆ ఆర్జీల్లో ఉన్న వాటికి నిధులు మంజూరు చేసి కమ్యూనిటీ భవనాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొరుముట్ల శ్రీనివాసులు( రైల్వే కోడూరు)రైల్వేకోడూరు నియోజకవర్గంలో 5 మండలాలు, 100 పంచాయతీలు, 3 లక్షల మంది జనాభా ఉన్నారని... అలాంటి నియోజకవర్గంలో సరైన సదుపాయాలు లేకపోవడం బాధకరమన్నారు. పంచాయతీల్లో ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేకపోవడం దారుణమన్నారు. 70 కమ్యూనిటీ హాల్స్ కోసం జిల్లా కలెక్టర్‌కు ఆర్జీలు చేశామని, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రికి సభ ద్వారా దరఖాస్తులు పంపిస్తున్నామని తెలిపారు. ఐనా ఫలితం లేదన్నారు. గతంలో మేజర్ పంచాయతీల్లో ఒక్కో భవనానికి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి... రూ. 25 లక్షల మంజూరు చేశారని, ప్రస్తుతం మంజూరు చేసే రూ. ఏడున్నర లక్షలు దేనికి సరిపోతాయని ప్రశ్నించారు. కమ్యూనిటీ భవనాలు నిర్మించడం వల్ల మహిళలు ఏదైనా శిక్షణ నైపుణ్యం మెరుగు పర్చుకోవడానికి ఉపయోగపడుతుందని వివరించారు.
ప్రతాప్ అప్పారావు(నూజివీడు ఎమ్మెల్యే)నూజివీడులో 100 పడకల ఆస్పత్రి ఉండి కూడా నిరుపయోగంగా మారుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో కనీసం 14 మంది వైద్యులైనా ఉండాల్సి ఉండగా...కేవలం ముగ్గురే ఉన్నారని చెప్పారు. దీంతో, అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చే వారిని విజయవాడకు రిఫర్ చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందికి గత కొన్నాళ్లుగా జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కమిటీ నుంచి తీసేసిన ఎమ్మెల్యేలను తిరిగి చేర్చాలని, ఆస్పత్రికి నిధులు వెచ్చించి పేద రోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.