విలీన మండలాలను ప్రభుత్వం విస్మరిస్తోందిః రాజేశ్వరి

తూర్పుగోదావరి జిల్లా

: విలీన మండలాల్లో వరదముంపు పొంచి ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సూచించారు. గోదావరి, శబరి నదులు ఉధృతంగా  ప్రవహిస్తున్నందున ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు వరద వచ్చే సూచనలున్నాయని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.

వరద పరిస్థితిని సమీక్షించేందుకు విలీన మండలాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం అధికారులను నియమించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో వరదలకు ముందే సెక్టోరల్ అధికారులను నియమించి వరదముప్పును పరిష్కరించేవారని, ఆంధ్రాలో విలీనం అనంతరం ప్రభుత్వం విలీన మండలాలను విస్మరిస్తోందని రాజేశ్వరి విమర్శించారు. ఇంతవరకు మండలాల్లో లాంచీలను సైతం సిధ్థం చేయలేదని, ఇలాగైతే ప్రజలను ఎలా రక్షిస్తారంటూ ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మేల్కోవాలన్నారు. 

Back to Top