ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

–అధికార యంత్రాంగంతో దేవీనగర్, రాయనగర్‌లో ఎమ్మెల్యే పర్యటన
–37వ వార్డులో వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యత్వ నమోదు

ఆదోని టౌన్‌: ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. సమస్యలతో ప్రజలు ఏకరువు పెడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రోడ్లు, మురికి కాలువలు, తాగునీరు, వీధి దీపాలు, రేషన్‌కార్డులు లేక, చౌక డిపోలలో నిత్యావసర సరుకులు అందక ప్రజలు నరకం చవిచూస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండవ రోజు సోమవారం పట్టణంలోని 37వ వార్డు రాయనగర్, దేవీనగర్, పై కొట్టాలలో నిర్వహించారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆయా ప్రాంతాలలో అనుచర వర్గంతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వైయస్‌ఆర్‌ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. 100 ఇళ్లు తిరిగి 200 మందితో సభ్యత్వాన్ని నమోదు చేయించారు. మహిళలు, యువతులు, వృద్ధులు వైయస్‌ఆర్‌ పేరు వినగానే తామూ సభ్యత్వాన్ని స్వీకరిస్తామంటూ ముందుకొచ్చారు. వారందరితో అనుచరగణం సభ్యత్వ నమోదు చేయించారు.

Back to Top