ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పట్టవా..!

–కనీస సౌకర్యాలులేక ప్రజలు అల్లాడిపోతున్నారు
–విలేకర్లతో కత్తెర హెని క్రిస్టినా వెల్లడి 

ఫిరంగిపురంః  గ్రామాల్లో నెలకొన్న ప్రజాసమస్యలు అధికార పార్టీ నాయకులకు పట్టడంలేదని తాడికొండ నియోజకవర్గం వైయస్సార్‌సీపీ ఇన్‌చార్జి కత్తెర హెని క్రిస్టినా విమర్శించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మురుగు కాలువలు, తాగునీరు, విద్యుత్‌ సమస్యలతో ప్రజలు, రైతులు ఆల్లాడిపోతున్నారన్నారు. కనీస సౌకర్యాలను సైతం ఏర్పాటు చేయడంలో విఫలమైన అధికారపార్టీ పనితీరు కారణంగా ప్రజలకు అవస్థలు తప్పడంలేదని విమర్శించారు. మేజరు పంచాయితీల్లో కూడా మురుగు కాలువల సమస్య కారణంగా నిత్యం స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అమీనాబాద్, గుండాలపాడు, యరగుంట్లపాడు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే నిదర్శనమని స్పష్టం చేశారు. గుండాలపాడు గ్రామంలో రెండు నెలలుగా మంచినీటి సరఫారా లేక పోవడం పంచాయితీ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. బేతపూడి గ్రామంలో రెండు నెలలుగా విద్యత్‌ ట్రాన్స్‌పార్మర్‌ ఏర్పాటు చేయడంలో నెలకొన్న జాప్యం కారణంగా విద్యత్‌ సరఫరా సక్రమంగా లేక నిత్యం గ్రామస్థులు నరకం అనుభవిస్తున్నారని వివరించారు. దరదాహంతో అవినీతికి పాల్పడుతున్న జన్మభూమి కమిటీ సభ్యులను వెంటనే రద్దు చేయాల్సిన అవసరం వుందన్నారు. గ్రామాల్లో అభివృద్ది విషయంలో కూడా పార్టీలను అడ్డుగా చూపి ఇప్పటికే భారీ స్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. గ్రామాల అభ్యున్నతి జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమౌతుందని చెప్పారు. మండలపార్టీ అద్యక్షుడు సయ్యద్‌ హబీబుల్లా, సొసైటీ అద్యక్షుడు చేవూరి రామ్మోహన్‌రెడ్డి, మండల ఎస్సీ విభాగం పార్టీ అద్యక్షుడు సేవా నాగరాజు తదితురులు అమెతో పాటు వున్నారు.

Back to Top