సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

  • వింత వ్యాధులతో అమాయకులు మృత్యువాత
  • గిరిజనుల అభివృద్ధికి చర్యలేవి?
  • కాపు రిజర్వేషన్లపై కాలయాపన తగదు
  • నల్లకుభేరుడు శేఖర్‌రెడ్డికి టీడీపీ నేతలతో వ్యాపార లావాదేవీలు
  • తుపాన్‌పై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసిన వైయస్‌ జగన్‌
  • వైయస్‌ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
హైదరాబాద్‌: తెలుగు దేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. గిరిజనుల బతుకులు దుర్భరంగా మారాయని కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పలు అంశాలపై చర్చించిన ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు సంబంధించిన అనేకమైన అంశాలను పొందుపరిచారని కన్నబాబు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, వైద్యం కరువైందని, అమాయక ప్రజలు వింత వ్యాధులతో బాధపడుతున్నా..సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తూర్పు గోదావరి జిల్లా రాజవోమ్మంగి మండలంలో కాళ్లవాపు వ్యాధితో 4 నెలల వ్యవధిలో 14 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వైయస్‌ జగన్‌ జిల్లాలో పర్యటించిన సమయంలో బాధిత కుటుంబాలను పరామర్శించారని తెలిపారు. పౌష్టికాహార లోపం కారణంగా నవజాత శిశువులు కన్నుమూస్తున్నా ఈ ప్రభుత్వం మేల్కోకపోవడం దుర్మార్గమన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సందర్శించినప్పుడు అనేక సమస్యలు వెలుగు చూశాయన్నారు. ఇన్ని సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే సర్కార్‌ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఐటీడీఏకు సరైన అధికారులను నియమించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. సకాలంలో 108 వాహనం రావడం లేదని, దీంతో వైద్య సేవలకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మహానేత హయాంలోనే..
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యార్థులకు మెస్‌ చార్జ్‌లు పెంచారని, ఆ తరువాత పెంచకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు మెస్‌ చార్జ్‌లు పెంచుతామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. అలాగే గిరిజన యువతుల పెళ్లిల కోసం కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.50 వేలు చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఏ ఒక్కరికి ఆర్థిక సాయం చేయలేదన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు చేస్తామన్న సర్కార్‌ జాడ లేకుండా పోయిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై చంద్రబాబు విజన్‌ ఏంటో అర్థం కావడం లేదన్నారు. బాబుకు  కాంట్రాక్టర్లపై ఉన్న ధ్యాస..భూములిచ్చిన రైతులపై లేదని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టి పెట్టాలని కన్నబాబు సూచించారు.

కాపులకిచ్చిన హామీ నెరవేర్చాలి
 చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వైయస్‌ఆర్‌సీపీ నేత కన్నబాబు డిమాండ్‌ చేశారు. నాడు కాపులను బీసీ జాబితాలో చేర్చుతామన్న చంద్రబాబు ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బీసీలకు అన్యాయం చేయకుండా కాపులను బీసీ జాబితాలో చేర్చాలని శాంతియుతంగా చేపట్టే ప్రతి పోరాటానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తుందన్నారు. 

టీడీపీ నేతలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టాలి
కొత్త రూ.2 వేల నోట్లు అక్రమంగా పొందిన నల్లకుభేరుడు తమిళనాడుకు చెందిన శేఖర్‌రెడ్డితో సంబంధాలు ఉన్న టీడీపీ నేతలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టాలని వైయస్‌ఆర్‌సీపీ నేత కన్నబాబు కోరారు. శేఖర్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, వీరితో పాటు పలువురు టీడీపీ నేతలతో శేఖరరెడ్డి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. వీరందరిపై దృష్టిపెడితే మరింత బ్లాక్‌మనీ వెలికివస్తుందని చెప్పారు. నల్లకుభేరులను ప్రోత్సహిస్తున్న టీడీపీ నేతలను ఐటీ అధికారులు విచారణ చేపడితే మరింత సమాచారం వస్తుందని అభిప్రాయపడ్డారు.

తుపాన్‌పై అప్రమత్తం 
వార్ద తుపాన్‌పై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారని తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు తెలిపారు. సోమవారం ఉదయం వైయస్‌ జగన్‌ ఆయా జిల్లాల పార్టీ నాయకులతో సంప్రదించి తుపాన్‌ ప్రభావం, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని అధినేత సూచించినట్లు కన్నబాబు చెప్పారు. 
 
Back to Top