ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి

()బాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే
()హామీలను విస్మరించి ప్రజలను వెన్నుపోటు పొడిచారు
()ఇంతటి దుర్మార్గపు ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరు
()రైతులకు దమ్మిడి సాయం చేయడం లేదు
()ఇప్పటికైనా కళ్లు తెరిచి వరద బాధితులను ఆదుకోవాలి
()ముంపు ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటన

గుంటూరుః చంద్రబాబు సర్కార్ గ్రామాలను, రైతులను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. భారీ వర్షాలతో ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే అవేమీ పట్టకుండా చంద్రబాబు విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఆనాడు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారు. ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ వైయస్ జగన్ పంటనష్టపోయిన రైతులు, బాధిత నిరాశ్రయులకు అండగా నిలిచారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రెడ్డిగూడెంలో వరద బాధితులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, పాలకులు ఎవరూ తమ వద్దకు రాలేదని, ఏ సహాయం చేయడం లేదని బాధితులు వైయస్ జగన్ వద్ద వాపోయారు. వైయస్సార్సీపీ నేతలే తమను ఆదుకున్నారని చెప్పారు.  ఈసందర్భంగా జననేత మాట్లాడుతూ....ప్రభుత్వం బాధితులకు దమ్మిడి సాయం కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు  గ్రామాల్లోకి రాకుండా పొలిమేరలనుంచే వెళ్లిపోవడం దారుణమని అన్నారు.

రాష్ట్రంలో వేయి కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని లెక్కలు గట్టారు. ఒక్క గుంటూరు జిల్లాకే రూ.120 కోట్లు ఇవ్వాలి. వేయి కోట్లలో 463 కేంద్రం చెల్లిస్తే దాన్ని కూడా బాబు వేరే కార్యక్రమాలకు ఖర్చుచేయడం ఘోరమన్నారు. అసలు ఈమనిషికి రైతుల మీద ప్రేమ ఉందా ..? బాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని వైయస్ జగన్ విమర్శించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి బాబు మాట తప్పారని జగన్ ఫైర్ అయ్యారు. రుణాలు మాఫీ గాకపోవడంతో గత్యంతరం లేక మహిళలు తాళిబొట్లు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకుంటున్న పరిస్థితి తలెత్తిందని అన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు...ఎన్నికలయిపోయాయి ప్రజలతో పనైపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. బ్యాంకులు బంగారం వేలం వేస్తుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా, రైతులకు రుణాలివ్వొద్దంటూ బాబు బ్యాంకులకు చెప్పడం దారుణమన్నారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి దేశంలో మరొకరు ఉండరని నిప్పులు చెరిగారు. 

అప్పులు చేసి మరీ పంటలు వేసుకుంటే...చేతికొచ్చిన సమయంలో అవి నీట మునగడంతో రైతుకు కన్నీరే మిగిలిందని వైయస్ జగన్ ఆవేదన చెందారు. జూలై, ఆగష్టు చివర వరకు వర్షాలు రాక పంటలు ఎండిపోయాయి. ఉన్న కొద్దోగొప్పో సాగుచేసుకుంటున్న తరుణంలో వర్షాలు ముంచెత్తాయి. లక్షల ఎకరాల్లో ప్రత్తి, వరి, మిరప పంటలు పూర్తిభాగం దెబ్బతిన్నాయి. గ్రామంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇళ్లలో బియ్యం తడిసి ముద్దయ్యాయి. స్కూళ్లో 30 కంప్యూటర్లు నీటిలో తడిసిపోయాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే  సాయం చేయకుండా బాబు హెలికాప్టర్లలో తిరగుతున్నాడు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని వైయస్ జగన్  విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు, నిరాశ్రయులకు వైయస్సార్సీపీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని, తోడుగా నిలుస్తుందని వైయస్ జగన్ స్పష్టం చేశారు. 


Back to Top