జిల్లా ప్లీనరీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం

మడకశిర: అనంతపురంలో బుధవారం జరిగే వైయస్సార్‌సీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నియోజకవర్గంలోని వైయస్సార్‌సీపీ నాయకులు విజయవంతం చేయాలని పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి, మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, వైయస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, జిల్లా కార్యదర్శులు రంగేగౌడ్, డాక్టర్‌ దేవరాజు, వాగేష్‌ సోమవారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుంబంధ సంఘాల అధ్యక్షులు, మండల కమిటీ కన్వీనర్లు, రాష్ట్ర అనుబంధ సంఘాల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్‌ విండో అధ్యక్షులు తదితర ప్రముఖులు తరలిరావాలని కోరారు. ఈ ప్లీనరీ సమావేశంలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. టీడీపీ నేతలు స్వార్థప్రయోజనాలను చూసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని అధికార పార్టీ నాయకులు విస్మరించి పని చేస్తున్నారన్నారు. దోపిడీ, భూకబ్జాలతో అధికార పార్టీ నాయకులు అక్రమాలకుపాల్పడుతున్నారని విమర్శించారు. రైతులు, కూలీలు, నిరుద్యోగులసమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తోందనని విమర్శించారు. మడకశిర నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా సాగునీరు అందించడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు విఫలమైందన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఈ ప్లీనరీలో చర్చించి తీర్మానం చేస్తామని వారు తెలిపారు.

Back to Top