మిర్చి రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం

–రూ 5 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిపై మాటతప్పిన ప్రభుత్వం
–మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

జగ్గయ్యపేట అర్బన్‌: మిర్చి రైతులను ఆదుకోవటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, వైయస్సార్‌ సీపీ శాసన సభాపక్షం ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణానికి వచ్చిన ఆయన స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభానుతో కలసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సరైన వర్షాలు లేక వ్యవసాయరంగం నేడు దుర్భర పరిస్థితుల్లో ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చకపోవటంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదన్నారు. రూ 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తటంలేదని ఆరోపించారు. మిర్చిపంటకు గతంలో రూ 11 వేలు ధర పలకగా, నేడు రూ 3 వేల లోపులోనే ఉండటంతో రైతుల పరిస్థితి చాల దయనీయంగా ఉందన్నారు. గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం రూ 3 వేలు ఇస్తామన్నప్పటికి రాష్ట్రపభుత్వం ఇంతవరకు ఏమి చేయలేదని, రూ 1500 ఇస్తున్నామంటూ చేతులు దులుపుకుందన్నారు. ప్రభుత్వ తీరు ఈ విధంగా ఉంటే రైతులు ఏవిధంగా అప్పుల ఊబిలో నుండి బైటపడగలుగుతారని ప్రశ్నించారు. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందని అంటే అది చంద్రబాబు ప్రభుత్వమే అన్నారు. అనంతరం ఉదయభాను,మున్సిపల్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు కలిసి రామచంద్రారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ అక్భర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి చిన్నా, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చౌడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ముత్యాల చలం, పార్టీ మండల అధ్యక్షుడు చిలుకూరి శ్రీనివాసరావు, నాయకులు నంబూరి రవి,నూకల రంగా,బూడిద నరసింహారావు,సిహెచ్‌.రాంబాబు,రోశయ్య,ఎస్‌.సూరిబాబు, కౌన్సిలర్లు గెంటేల పాండురంగారావు,ఫిరోజ్‌ఖాన్, గెంటెల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Back to Top