హామీలకు తూట్లు పొడిచిన టీడీపీ ప్రభుత్వం

అసెంబ్లీః ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ..చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాలకు ప్రభుత్వం కేవలం 342 ఇళ్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. నియోజకవర్గానికి 27 ఇళ్లు మాత్రమే వస్తున్నాయన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోని  150 గ్రామపంచాయతీలకు  ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు ఏమూలకు సరిపోతాయని ప్రశ్నించారు. 

అదేవిధంగా 10 సంవత్సరాలు పైబడిన ఇళ్ల మరమ్మతు కోసం... ఒక్కో ఇంటికి రూ. 5 వేలు ఇస్తామని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందని సునీల్ కుమార్ గుర్తు చేశారు. ఇంతవరకు వాటిని చెల్లించిన దాఖలాలు లేవన్నారు. ఇచ్చిన వాటికే దిక్కులేదని, ఇవ్వని హామీలు కూడా  నెరవేరుస్తున్నామని సదరు మంత్రి అబద్ధాలు చెబుతున్నారని ఫైరయ్యారు. 

ఇటీవల జిల్లాలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 15 వేలు ఇస్తామన్న ప్రభుత్వం...ఇంతవరకు అవి చెల్లించిన పాపాన పోలేదన్నారు. అదేవిధంగా గోడలు పెచ్చులూడి అనేక మంది ప్రజలు భయంభయంగా బతుకుతున్నారన్నారు. మళ్లీ వర్షాకాలం వస్తున్నందున ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సునీల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Back to Top