ప్రభుత్వం లబ్దిదారుల పొట్టగొడుతోంది

ప్రభుత్వ కార్యాలయాలను ..
టీడీపీ కార్యాలయాలుగా మార్చారు
ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేస్తున్నారు
రాష్ట్రంలోని ఖాళీలన్నంటినీ తక్షణమే భర్తీ చేయాలిఃశ్రీకాంత్ రెడ్డి

హైద‌రాబాద్: అగ్రిగోల్డ్ అంశంపై ప్రభుత్వం చర్చకు వెనుకడుగేయడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం తన వాళ్లకు మేలు చేకూరుస్తూ అర్హులైన లబ్దిదారుల పొట్టగొడుతోందని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 ల‌క్ష‌ల మందికి సంబంధించిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై  కోర్టు ఎక్క‌డ సీబీఐ విచార‌ణ వేస్తుందోన‌ని భ‌య‌ప‌డే...అధికార టీడీపీ, సీఐడీ విచార‌ణ వేయించుకొని త‌న‌వాళ్ల‌కు లబ్ది చేకూరుస్తుందని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్ప‌డిన వారిని తప్పించేందుకు  ప్రభుత్వం విశ్వ‌ప్ర‌యత్నాలు చేస్తుందని ఆరోపించారు.  

అర్హులైన ల‌బ్ధిదారుల‌కు న్యాయం చేయాల‌ని అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షం ప‌ట్టుప‌డితే ....అధికార ప్ర‌భుత్వం మ‌రోవిధంగా వైఎస్సార్‌సీపీపై ఎదురుదాడికి దిగుతోందని శ్రీకాంత్ రెడ్డి  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉద్యోగ‌స్తుల‌పై క‌క్ష‌పూరితంగానే వ్య‌వ‌హరిస్తుంద‌ని శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు. గ‌త తొమ్మిదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు ఉద్యోగ‌స్తుల‌ను అనేక ర‌కాలుగా వేధించాడని చెప్పారు. 

ఉద్యోగస్తులను నానా ఇబ్బందులు పెట్ట‌డం, వారిని తిట్ట‌డం, విధుల‌కు అటంకం క‌లిగించ‌డం, ఉద్యోగ‌స్తులు క‌ష్టప‌డి మంచి గుర్తింపు తెచ్చుకుంటే ఆ గుర్తింపు త‌న‌వ‌ల్లే వ‌చ్చింద‌ని ప్రగల్భాలు పలకడం బాబుకు అలవాటుగా మారిందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తి నిరుపేద కుటుంబానికి ఇంటి ప‌ట్టా అందించి ఇల్లు క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, దానిపై వైఎస్సార్‌సీపీ అనేకసార్లు ప్ర‌శ్నిస్తే 242, 243 జీవోల‌ను విడుద‌ల చేశార‌న్నారు. ఆ జీవోల‌ను సుప్రీం కోర్టులో వేస్తే  ప‌బ్లిక్ లిటిగేష‌న్ నుంచి ఒక అప్పీల్ వ‌చ్చిందని, ఐతే దాన్ని సరిగా పరిశీలన చేయకపోవడంతో  ఉద్యోగస్తులు ఎంతో నష్టపోతున్నారన్నారు. ఉద్యోగ‌స్తుల‌కు న్యాయం జ‌ర‌గ‌కుండా టీడీపీ కుట్ర‌ ప‌న్నుతుంద‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. 

ఉద్యోగస్తుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, వాళ్లకు జీతాలు ఇవ్వడమే దండగని మంత్రులు విమర్శించడం దారుణమన్నారు.  ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆనెపాన్ని ఉద్యోగస్తులపై నెడుతోందని ఆగ్రహించారు. ఉద్యోగస్తుల పనులకు ఆటంకం కలిగిస్తూ వారిని బ‌దిలీ చేయ‌డం, ఏవైన భ‌ర్తీలుంటే వాటిని పెండింగ్‌లో ఉంచ‌డం ఒక్క టీడీపీ ప్ర‌భుత్వానికే చెల్లించంద‌న్నారు. తమ మాట వినని వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డం, లేకుంటే బ‌దిలీ చేయ‌డం, పోలీసులతో అక్ర‌మంగా కేసులు పెట్టించి హింసించే మార్గం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అధికార టీడీపీపై ధ్వజమెత్తారు. 

ఎండీఓ, ఎంఆర్ఓ, మండ‌ల, జిల్లాస్థాయి అధికారుల‌ హక్కులను కాలరాసేవిధంగా.... జన్మ‌భూమి క‌మిటీలు వేసి అవే రాజ్యాంగ బద్ద కమిటీలు అన్న విధంగా ప్రభుత్వం  వ్యవహరించడం దుర్మార్గమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  ఉద్యోగ‌స్తుల ప్ర‌మేయం లేకుండా వారి సంత‌కాల‌తోనే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం దారుణమని మండిపడ్డారు. ఇది ఉద్యోగ‌స్తుల‌ను అవ‌మానించ‌డ‌మేన‌న్నారు.  ప్ర‌భుత్వ కార్యాల‌యాలు టీడీపీ క్యాంప్ కార్యాల‌యాలుగా మారాయ‌ని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. కొంద‌రు ఉద్యోగులు రాజ్యాంగ బ‌ద్ధంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అందించాల‌ని సూచిస్తే ..మీకేందుకు జీతాలు దండ‌గా, మీరే అన్ని త‌ప్పులు చేస్తున్నార‌ని వారిపైనే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వాపోయారు. 

ప్రభుత్వం తూతూ మంత్రంగా వెయ్యి, రెండు వేల ఉద్యోగాలు స‌ర్వీస్ క‌మిష‌న్‌లో భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పిందని...ఐతే,  దానిపై కూడా ఇంత‌వ‌ర‌కు ఎలాంటి స‌రైన స‌మాచారం లేద‌న్నారు.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ల‌క్ష 42వేల ఉద్యోగాల‌ను తక్షణమే భ‌ర్తీ చేయాల‌ని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీకరించాలని  సూచించారు. కార్పొరేష‌న్‌ల‌లో ప‌ని చేసే ఉద్యోగుల వయోపరిమితి  60 సంవ‌త్స‌రాల‌కు పెంచాల‌న్నారు. 
Back to Top