గోపాల్‌రెడ్డి గెలుపు తథ్యం

కర్నూలు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలుపు తథ్యమని పార్టీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గోపాల్‌రెడ్డి తరఫున శనివారం బుడ్డా శేషారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తానని తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ధ్వజమెత్తారు.  ప్రత్యేక హోదా ద్వారానే   ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేవన్నారు


. ఐదు కోట్ల ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తన స్వార్థం కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పోరాటం చేస్తుంటే ఉద్యమంపై టీడీపీ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతుందన్నారు. దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను, ఎంపీటీసీలను కొనుగోలు చేసి అనైతిక రాజకీయాలకు చంద్రబాబు తెర లేపారని విమర్శించారు. గోపాల్‌రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
Back to Top