పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా గోపాల్‌రెడ్డి

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ రాయ‌ల‌సీమ (అనంత‌పురం, వైయ‌స్సార్ క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాలు) ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి 2017 లో జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా వెన్న‌పూస గోపాల్‌రెడ్డి బ‌రిలోకి దిగ‌నున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది.  అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ అధిష్ఠానం అధికారిక ప్ర‌క‌ట‌నను జారీ చేసింది. అనంత‌పురం జిల్లా రాప్తాడు మండ‌లం ప్ర‌స‌న్నాయ‌ప‌ల్లికి చెందిన వెన్న‌పూస గోపాల్‌రెడ్డి 1975-78 మ‌ధ్య కాలంలో సైన్యంలో ప‌ని చేశారు. అనంత‌రం స‌హ‌కార శాఖ‌లో జూనియ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా చేరారు. 17 ఏళ్ల పాటు జిల్లా ఎన్జీఓ సంఘం అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. అనంత‌రం ఉమ్మ‌డి రాష్ట్ర ఎన్జీఓ మాజీ అధ్య‌క్షుడిగా జేఏసీ చైర్మ‌న్‌గా, ఆలిండియా అసోసియేష‌న్ ఉపాధ్య‌క్షులుగా తొమ్మిదిన్న‌రేళ్లు ప‌ని చేశారు. 


2013 జూన్ 30న ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. ఆయ‌న కుమారుడు వెన్న‌పూస ర‌వీంద్రారెడ్డి అనంత‌పురం జిల్లా ప‌రిష‌త్‌లో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్నారు. గోపాల్ రెడ్డి అభ్య‌ర్థిత్వానికి, గ్రాడ్యుమేట్ నియోజ‌క‌వ‌ర్గం ఓట‌ర్ల న‌మోదు మొద‌లు ఆయ‌న విజ‌యం వర‌కు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, శాస‌న‌స‌భ్యులు, మండ‌లి స‌భ్యులు, నియోజ‌క‌వ‌ర్గాల కో-ఆర్డినేట‌ర్లు, పార్టీలోని ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 
Back to Top